YS Sharmila : మహిళలకు ఫ్రీ బస్ పథకం అమలుపై కూటమి కాలయాపన : వైఎస్ షర్మిల ధ్వజం
మహిళలకు ఫ్రీ బస్ పథకం(Free Bus for Women) అమలుపై కూటమి ప్రభుత్వాని (AP Government)కి చిత్తశుద్ధి లేదని, అందుకే కేబినెట్ సబ్ కమిటీ(Cabinet Subcommittee ) పేరుతో కాలయాపన చేస్తుందని ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్.షర్మిల(YS Sharmila)ఎక్స్ వేదికగా విమర్శించారు.
దిశ, వెబ్ డెస్క్ : మహిళలకు ఫ్రీ బస్ పథకం(Free Bus for Women) అమలుపై కూటమి ప్రభుత్వాని (AP Government)కి చిత్తశుద్ధి లేదని, అందుకే కేబినెట్ సబ్ కమిటీ(Cabinet Subcommittee ) పేరుతో కాలయాపన చేస్తుందని ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్.షర్మిల(YS Sharmila)ఎక్స్ వేదికగా విమర్శించారు. అధికారం చేపట్టిన 6 నెలల్లో పండుగలు, పబ్బాలు పేరు చెప్పి ఉచిత బస్సు పథకం అమలును దాటవేశారని, బస్సులు కొంటున్నాం అని చెప్పుకొచ్చారని, ఇప్పుడు మంత్రివర్గ ఉప సంఘం పేరుతో మరికొన్ని రోజులు సాగతీతకు సిద్ధమయ్యారని షర్మిల ప్రభుత్వంపై మండిపడ్డారు. ఉచిత ప్రయాణం కల్పించడంలో ఇన్ని బాలారిష్టాలు ఎందుకు ? చిన్న పథకం అమలుకు కొండత కసరత్తు దేనికోసం ? తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే పథకం అమలు చేసి చూపించారు కదా ? అని చంద్రబాబును ప్రశ్నించారు.
అక్కడి రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్న బస్సుల్లోనే మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించారు కదా ? పథకం అమలును బట్టి అదనపు ఏర్పాట్లు చేసుకున్నారు కదా ? అని, జీరో టిక్కెట్ల కింద నెలకు రూ.300 కోట్లు ఆర్టీసీకి ఇవ్వడానికి మీ ప్రభుత్వం దగ్గర నిధులు లేవా ? అని షర్మిల నిలదీశారు. మహిళల భద్రతకు మీకు మనసు రావడం లేదా ? ఎప్పుడైనా సిద్ధంగా ఉన్నామని ఆర్టీసీ యాజమాన్యం చెప్తుంటే మీకొచ్చిన ఇబ్బంది ఏంటి ? కనీసం నూతన సంవత్సర కానుక కిందైనా మహిళలకు ఇచ్చిన మాట నిలబెట్టుకొని మీ చిత్తశుద్ది ఏంటో నిరూపించుకోవాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని షర్మిల పేర్కొన్నారు.