పలాసలో సీఎం జగన్: వైఎస్ఆర్ సుజలధార ప్రాజెక్టు ప్రారంభం
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శ్రీకాకుళం జిల్లా పలాసలో పర్యటించారు.
దిశ, డైనమిక్ బ్యూరో : ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శ్రీకాకుళం జిల్లా పలాసలో పర్యటించారు. వైఎస్ఆర్ సుజల ధార డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్‌ను వైఎస్ జగన్ ప్రారంభించారు. రూ.700 కోట్ల వ్యయంతో నిర్మించిన వైఎస్ఆర్ సుజలధార ప్రాజెక్టును సీఎం వైఎస్ జగన్ జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉద్దానం ప్రాంతంలో కళ్లెదుటే కిడ్నీ సమస్య కనిపిస్తున్నా గతంలో ఏ ప్రభుత్వాలు చొరవచూపలేదని చెప్పుకొచ్చారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.785 కోట్లతో ఉద్దానం వ్యాధిగ్రస్తుల సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని చూపించామని సీఎం వైఎస్ జగన్ వెల్లడించారు.ఉద్దానం ప్రాంతంలో దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధులు (క్రానిక్ కిడ్నీ డిసీజెస్) ప్రబలంగా ఉన్న ఏడు మండలాల్లోని అన్ని గ్రామాలకు ‘వైఎస్ఆర్ సుజలధార‘ ప్రాజెక్టు ద్వారా శుద్ధి చేసిన రక్షిత తాగునీరు అందించబోతున్నట్లు వెల్లడించారు. హిరమండలం రిజర్వాయర్ నుంచి నీటిని తీసుకుని శుద్ధి చేసి పలాస, ఇచ్ఛాపురం నియోజకవర్గాల పరిధిలో 7 మండలాల్లోని 807 గ్రామాలకు రక్షిత నీటి సరఫరా అందించబోతున్నట్లు తెలిపారు. ఈ ప్రాంతంలో ప్రస్తుతం ఉన్న 6.78 లక్షల జనాభా 2051 నాటికి 7.85 లక్షలకు చేరుతుందన్న అంచనాతో అప్పటి అవసరాలకు కూడా సరిపోయేలా ఒక్కొక్కరికి రోజుకు 100 లీటర్ల చొప్పున నీటి సరఫరా చేసేలా ప్రాజెక్టు నిర్మాణం చేసినట్లు వెల్లడించారు. ఇప్పటికే 613 గ్రామాలకు నీటి సరఫరా జరుగుతుందని సీఎం వైఎస్ జగన్ వెల్లడించారు. ఇకపోతే శ్రీకాకుళం జిల్లా పలాస పర్యటనలో భాగంగా సీఎం వైఎస్ జగన్ గుంటూరు జిల్లా తాడేపల్లిలోని నివాసం నుంచి ఉదయం 8 గంటలకు బయలుదేరి 10.30 గంటలకు కంచిలి మండలం మకరాంపురం గ్రామానికి హెలికాప్టర్‌లో చేరుకున్నారు. అక్కడ ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. అనంతరం 11.10 గంటలకు వైఎస్ఆర్ సుజలధార ప్రాజెక్టు పంప్‌హౌస్ స్విచ్ నొక్కి సీఎం జగన్ ప్రారంభించారు.