YS Jagan Mohan Reddy వ్యూహం ఫలించేనా!..వారిలో ఆక్రోశాన్ని తగ్గిస్తుందా?
దాదాపు తొమ్మిదేళ్లపాటు జెండాలు మోశారు. నాడు టీడీపీ దాడులకు ఎదురొడ్డి నిలిచారు. తీరా అధికారానికి వచ్చాక పూచిక పుల్ల మాదిరి పక్కన పడేశారు..
- గృహ సారధులు, సచివాలయ కన్వీనర్ల నియామకం
- ప్రజల్లో ప్రభుత్వ వ్యతిరేకతకు చెక్‌పెట్టేందుకేనా !
- ఒక్కో చోట ఒక్కో రకమైన ఉపశమన చర్యలు
దిశ, ఏపీ బ్యూరో: "దాదాపు తొమ్మిదేళ్లపాటు జెండాలు మోశారు. నాడు టీడీపీ దాడులకు ఎదురొడ్డి నిలిచారు. తీరా అధికారానికి వచ్చాక పూచిక పుల్ల మాదిరి పక్కన పడేశారు. ఈ మూడున్నరేళ్ల నుంచి కనీసం పలకరించిన నాధుడు లేడు. కనీసం దగ్గరకూ రానివ్వలేదు. మళ్లీ ఏడాదిన్నరలో ఎన్నికలొస్తున్నాయి కదా! గుర్తొచ్చి ఉంటారు. అందుకే గృహ సారధులు, కన్వినర్లంటూ హడావుడి చేస్తున్నారు. సొంత డబ్బులు ఖర్చు పెట్టి కష్టకాలంలో పార్టీని నడిపించినోళ్లు కొంపాగోడు అమ్మేసుకొని ఏదో పని చేసుకుంటున్నారు. కార్యకర్తల పట్ల పార్టీ నిర్లక్ష్యాన్ని ఎలా మరచిపోతారు?" అంటూ గతంలో పార్టీకి అన్నీ తామై వ్యవహరించి తెరమరుగైన ఓ వైసీపీ నాయకుడు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వంపై ప్రజల్లో పెరిగిన వ్యతిరేతను తగ్గించడానికి పార్టీ నిర్మాణాన్ని బలోపేతం చేయాలని భావించినట్లుంది. సీఎం జగన్వ్యూహం ఏమేరకు ఫలిస్తుందనే దానిపై వైసీపీలో చర్చనీయాంశమైంది.
వైసీపీ కార్యకర్తల్లో గూడు కట్టుకున్న ఆక్రోశాన్ని తొలగించేందుకు నెల్లూరు రూరల్ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి బృహత్తర పథకాన్ని ప్రకటించారు. పార్టీ కోసం పని చేసిన ప్రతీ కార్యకర్త కుటుంబానికి ఉచిత వైద్యం అందిస్తానంటూ భరోసా ఇస్తున్నారు. అందుకోసం తన స్నేహితులు, బంధువులు, మరికొన్ని స్వచ్చంద సంస్థల సహకారం తీసుకోనున్నట్లు ఆయన వెల్లడించారు. ఈపాటికే కొన్ని కార్పొరేట్ఆస్పత్రులను సంప్రదించినట్లు పేర్కొన్నారు. కనీసం ఆ నియోజకవర్గంలో పని చేస్తోన్న కార్యకర్తలను తమను ప్రత్యేకంగా గుర్తించారనే భావన నెలకొల్పే ఉద్దేశం కావొచ్చు. సహజంగానే ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి నిరంతరం జనంలో ఉంటారు. పార్టీ అధికారానికి వచ్చాక కార్యకర్తలకు ఏమీ చేయలేదనే అసంతృప్తికి చెక్‌పెట్టేందుకు ఇది కొంతైనా పని చేస్తుందని ఆశించి ఉండొచ్చు.
నెల్లూరు, కడప జిల్లాల సమన్వయకర్త, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పార్టీ బలోపేతంపై దృష్టి సారిస్తూనే మరో అడుగు మందుకేశారు. ఆయన నియోజకవర్గంలోని ఒంగోలులో సొంతంగా సామాజిక పింఛన్లు ఇస్తున్నారు. వివిధ కారణాల రీత్యా ఇటీవల తొలగించిన పింఛన్లతోపాటు ఇంకా తమకు అర్హత ఉండి అందలేదంటున్న వారి జాబితా సేకరించారు. వాళ్లతో మళ్లీ దరఖాస్తు చేయించినా ప్రభుత్వం మంజూరు చేసేందుకు కొంత సమయం పడుతుంది. అప్పటిదాకా ఆగితే వ్యతిరేకత పెరుగుతుందని భావించినట్లుంది. సుమారు రెండు వేల మందికి ఆయన సొంత డబ్బు వెచ్చించి ప్రతి నెలా పింఛన్లు అందజేస్తున్నట్లు బాలినేని అభిమానులు చెబుతున్నారు.
ఇవన్నీ ఒక ఎత్తయితే గృహ సారధులు, గ్రామ, వార్డు సచివాలయ కన్వినర్లుగా కార్యకర్తలను నియమించడం వెనుక సీఎం జగన్పెద్ద వ్యూహమే ఉన్నట్లు సమాచారం. ఇటు కార్యకర్తలను పట్టించుకోలేదనే దానికి చెక్‌పెట్టొచ్చు. మరోవైపు ప్రజలను నేరుగా కలిసి మాట్లాడడం ద్వారా కొంత వ్యతిరేకతను తగ్గించ వచ్చనేది కావొచ్చు. ఎవరికి ఏ సమస్య ఎదురైనా పక్కనోడు పట్టించుకునే రోజులు కావివి. ఎవరికి వారే యమునా తీరే అన్న పరిస్థితుల్లో జనం కొట్టుమిట్టాడుతున్నారు. ఇలాంటి సమయంలో 'అధికార పార్టీ నుంచి మేమొచ్చాం. మీ సమస్యలు చెప్పండి. అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తాం!' అంటూ గృహ సారథులు వెళ్తే.. సమస్యలు పరిష్కారం అయినా కాకున్నా ముందు తమ గోడు వినేవాళ్లున్నారనే ఓ స్వాంతన లభిస్తుంది.
ఈ ఎత్తుగడ సక్రమంగా అమలైతే పార్టీ అధిష్టానం అనున్నట్లే ఫలితాలు రావొచ్చు. ఆక్రోశంలో ఉన్న కార్యకర్తలు చిత్తశుద్దితో పని చేస్తారా! ఇన్నాళ్లూ తమను గాలికొదిలేశారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో కార్యకర్తల ప్రమేయం లేకుండా చేశారు. ఇప్పటిదాకా వలంటీర్లు, సచివాలయాలు, కలెక్టర్లు, సీఎం జగన్‌తోనే పాలన మొత్తం సాగించారు. మళ్లీ ఎన్నికల నాటికి గుర్తొచ్చామా అనే అసంతృప్తి వీడి ఏమేరకు పని చేస్తారనేది పార్టీ నాయకత్వంలో ఆందోళన రేకెత్తిస్తోంది. కార్యకర్తలు గత ఎన్నికల్లో మాదిరి కృషి చేయకుంటే వలంటీర్లతో నెట్టుకు రాలేమని ఈపాటికే అధిష్టానం గుర్తించింది. ఇప్పుడు ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకతను తగ్గించాలన్నా కార్యకర్తలను బలోపేతం చేసుకోవడం తప్ప మరో మార్గం లేదు. దీని ద్వారా ప్రజల్లో పెల్లుబుకుతున్న వ్యతిరేకతను కొంతమేర తగ్గించడానికి దోహదపడుతుందనేది పార్టీ అధిష్టానం ఆలోచన కావొచ్చు. ఈ దిద్దుబాటు చర్యలు ఏమేరకు ఫలితాలు ఇస్తాయనే దానిపై పార్టీ శ్రేణుల్లో విస్తృతంగా చర్చలు జరుగుతున్నాయి.