ఒంగోలు పంచాయితీ.. రెండు రోజుల్లో సెట్
ఒంగోలు పంచాయితీని సీఎం జగన్ మోహన్ ఫోకస్ పెట్టారు..
దిశ, వెబ్ డెస్క్: ఒంగోలు పంచాయితీపై సీఎం జగన్ మోహన్ ఫోకస్ పెట్టారు. రెండు రోజుల్లో పరిష్కరించేందుకు కసరత్తులు చేస్తున్నారు. ఇప్పటికే ఈ నియోజకవర్గం వైసీపీలో వర్గ విభేదాలు తారా స్థాయికి చేరాయి. బాలినేని, సుబ్బారెడ్డి, ఆదిమూలపు అంటూ జిల్లాలో మూడు వర్గాలుగా విడిపోయాయి. దీంతో నియోజకవర్గం సమన్వయ కర్తగా విజయసాయిరెడ్డిని నియమించారు. అయినా సరే వర్గవిభేదాలు బయటపడుతూనే ఉన్నాయి. మంత్రి ఆదిమూలపు సురేశ్‌ను ఎర్రగొండపాలెం నుంచి కాకుండా ఈసారి కొండపి నుంచి పోటీ చేయించేపనిలో అధిష్టానం ఉంది. ఈ మేరకు ఆయనను కొండపి ఇంచార్జిగా నియమించింది. దీంతో నియోజకవర్గంలో కార్యక్రమాలు మొదలు పెట్టారు. అయితే తొలి నుంచి కూడా మంత్రి ఆదిమూలపు సురేశ్, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్‌కు పడదు. మంత్రి పదవుల విషయంలోనూ వీరి మధ్య క్లాష్ జరిగింది. చివరకు సీఎం జగన్ మంత్రి సురేశ్‌కే ప్రాధాన్యత ఇచ్చారు. మంత్రి వర్గ విస్తరణలో రెండో సారి కూడా అవకాశం ఇచ్చారు.
ఇక సుబ్బారెడ్డితో బాలినేనికి వైర్యం ఉన్నా అది అప్పుడప్పుడు హడావుడి చేసి వెళ్లిపోతుంది. ప్రధానంగా సురేశ్‌కు సీఎం జగన్ మంత్రి పదవిని కొనసాగించినప్పటి నుంచి బాలినేని పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. అయితే ఇటీవల ఒంగోలులో ఇళ్ల పట్టాల పంపిణీ వ్యవహారంలోనూ బాలినేని శ్రీనివాసరెడ్డి అసంతృప్తిగా ఉన్నారు. ఎమ్మెల్యే పదవికి బాలినేని రాజీనామా చేస్తారనే దాకా పరిస్థితి వెళ్లింది. దీంతో బాలినేనితో వైసీపీ అధిష్టానం జరిపిన చర్చలు సఫలం అయ్యాయి. ఈ మేరకు ఆయన ఒంగోలులో పార్టీ కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నారు. అయితే మంత్రి సురేశ్ నిర్వహించిన కార్యక్రమానికి మాత్రం వెళ్లలేదు. ఈ నేపథ్యంలో ఒంగోలు నుంచి బాలినేని శ్రీనివాసరెడ్డినే పోటీ చేస్తారని ఎంపీ విజయసాయిరెడ్డి స్పష్టం చేవారు. అయితే ఇళ్ల పట్టాల పంపిణీ విషయంలో సైలెంట్‌గా కోల్డ్ వార్ నడుస్తోంది. దీంతో సీఎం జగన్ రెండు రోజుల్లో ఈ పంచాయితీకి పరిష్కారం చూపుతారని తెలుస్తోంది.
ఇదే విషయంపై బాలినేని శ్రీనివాసరెడ్డి తనయుడు ప్రణీత్ రెడ్డి స్పందించారు. మరో రెండు రోజుల్లో సమస్యకు పరిష్కారం రాబోతుందని తెలిపారు. ఒంగోలు నుంచి తన తండ్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మరోసారి పోటీ చేయబోతున్నారని తెలిపారు. తాను మాత్రం ఈ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని తెలిపారు. కానీ తామంతా వైఎస్ జగన్ వెంటే ఉంటామని తెలిపారు. వచ్చే ఎన్నికలు పేదలకు పెత్తందార్లకు మధ్య జరుగుతుందని చెప్పారు. కచ్చితం మళ్లీ గెలిచి జగన్ రెండో సారి కూడా సీఎం అవుతారని ఆయన జోస్యం చెప్పారు.
బాలినేని తనయుడు చెప్పిన దాన్ని బట్టి ఒంగోలు పేదలకు ఇళ్ల స్థలాల కష్టాలు మరో రెండు రోజుల్లో తీరబోతున్నాయి. ఇన్ని నాళ్లు నాడ్చినా సమస్యను పరిష్కరిస్తే అంతేచాలని లబ్ధిదారులు అంటున్నారు. చూడాలి ఏం జరుగుతుందో...!