ఎన్నికల వేళ మంత్రి పెద్దిరెడ్డికి సీఎం జగన్ కీలక బాధ్యతలు..!
ఎన్నికల వేళ సీఎం జగన్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. పాలనా పరంగా,రాజకీయంగా వరుస నిర్ణయాలను ప్రకటిస్తున్నారు.
దిశ ప్రతినిధి, తిరుపతి: ఎన్నికల వేళ సీఎం జగన్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. పాలనా పరంగా,రాజకీయంగా వరుస నిర్ణయాలను ప్రకటిస్తున్నారు. ఇప్పటికే అభ్యర్థులను దాదాపు ఖరారు చేసిన జగన్ ఇప్పుడు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కి సీఎం జగన్ మరో కీలక బాధ్యతలను అప్పగించారు.ముఖ్యమంత్రి జగన్ తన పార్టీ అభ్యర్థులను దాదాపు ఫైనల్ చేశారు. కొన్ని ఎంపీ స్థానాల పై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఈ నెల 10న అద్దంకి సిద్ధం సభ ద్వారా ఎన్నికల మేనిఫెస్టో ప్రకటనకు నిర్ణయం తీసుకున్నారు. 2019లో ప్రకటించిన మేనిఫెస్టోలో 99 శాతం హామీలను అమలు చేసిన జగన్ ఇప్పుడు మరోసారి పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా ఎన్నికల నిర్వహణ పార్టీ పర్యవేక్షణకు సీనియర్లను బరిలోకి దించారు.
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రస్తుతం ఉన్న బాధ్యతలతో పాటుగా తిరుపతి పార్లమెంట్ రీజనల్ కో ఆర్డినేటర్ గా బాధ్యతలు కేటాయించారు. ఇప్పటి వరకు పెద్దిరెడ్డి అనంతపురం, హిందూపురం, చిత్తూరు పార్లమెంట్ నియోజకవర్గాలకు ఇంచార్జ్ గా ఉన్నారు. ఇప్పటివరకు తిరుపతి పర్యవేక్షించిన సీనియర్ నేత చెవిరెడ్డి భాస్కర రెడ్డి ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తుండటంతో ఆ బాధ్యతలను మంత్రి పెద్దిరెడ్డికి కేటాయించారు.మంత్రి పెద్దిరెడ్డి ఈ సారి కుప్పం నియోజకవర్గం పైన ప్రత్యేకంగా ఫోకస్ చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఓటమే లక్ష్యమని స్పష్టం చేస్తున్నారు.
అదే విధంగా అనంతపురం జిల్లాలోని హిందూపురం పైన గురి పెట్టారు. ఈ రెండు స్థానాల్లో పార్టీని గెలిపించే బాధ్యతలను సీఎం జగన్ మంత్రి పెద్దిరెడ్డికి అప్పగించారు. టీడీపీ అధినేత చంద్రబాబు సొంత జిల్లా కావటంతో చిత్తూరు జిల్లాలో మెజార్టీ సీట్లు గెలుస్తామని..మంత్రి పెద్దిరెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఇప్పుడు వైసీపీ మెజార్టీ సీట్లు సాధించడమే లక్ష్యంగా నిర్ణయించుకున్న ప్రాంతాల్లో బాధ్యతలను పెద్దిరెడ్డికి కేటాయించడంతో అక్కడ ఎన్నికల రాజకీయం ఆసక్తికరంగా మారుతుంది.