CM Jagan: అమరావతి రాజధాని ప్రాంత నిరుపేదలకు ప్రభుత్వం గుడ్ న్యూస్.. ఇక వారి పింఛన్ డబుల్
రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ జగన్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.
దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ జగన్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అమరావతి రాజధాని ప్రాంతంలో ఉపాధి కోల్పోయిన, భూమి లేని నిరుపేదలకు ఇచ్చే పింఛన్‌ను పెంచుతూ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం వారికి ఇస్తున్న రూ.2,500 పింఛన్‌ను, రూ.5 వేలకు పెంచుతూ మార్గ దర్శకాలను కూడా జారీ చేసింది. ఈ మేరకు అధికారులు జీవో విడుదల చేశారు. కాగా, గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో జరిగిన వాలంటీర్లకు వందనం కార్యక్రమంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ పింఛన్ మొత్తాన్ని పెంచుతామని హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జగన్ ఇచ్చిన మాట మేరకు ఏపీ ప్రభుత్వం వారికి పింఛన్ల మొత్తాన్ని పెంచుతూ నిర్ణయం తీసుకుంది. తాడికొండ, మంగళగిరి ప్రాంతాల్లో ఉపాధి కోల్పోయి, భూములు లేక 17 వేల కుటుంబాలు ఇబ్బంది పడుతున్నాయనే విషయం సీఎం జగన్ దృష్టి వచ్చింది. దీంతో ఆయన వారికి ఇచ్చే పింఛన్‌ను డబుల్ చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.