రైతులకు పంట రుణాలు జమ చేసిన CM.YS Jagan Mohan Reddy
'రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుపడుతుంది. దాదాపు 62 శాతం జనాభా వ్యవసాయం, వ్యవసాయ రంగం మీదనే ఆధారపడి ఉన్న పరిస్ధితుల్లో రైతును అన్ని రకాలుగా ఆదుకోగలిగితేనే ఏ రాష్ట్రమైనా బాగుపడుతుంది. అందుకే వైసీపీ ప్రభుత్వం రైతన్నకు అండగా నిలుస్తుంది' అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. ..
దిశ, డైనమిక్ బ్యూరో : 'రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుపడుతుంది. దాదాపు 62 శాతం జనాభా వ్యవసాయం, వ్యవసాయ రంగం మీదనే ఆధారపడి ఉన్న పరిస్ధితుల్లో రైతును అన్ని రకాలుగా ఆదుకోగలిగితేనే ఏ రాష్ట్రమైనా బాగుపడుతుంది. అందుకే వైసీపీ ప్రభుత్వం రైతన్నకు అండగా నిలుస్తుంది' అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయం నుంచి రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ, వైఎస్ఆర్ సున్నా వడ్డీ పంట రుణాల వడ్డీ రాయితీ సొమ్ముతో పాటు గతంలో వివిధ సాంకేతిక కారణాల వల్ల చెల్లింపులు పొందని వారి అకౌంట్లలో జమ చేసే సొమ్ముతో కలిపి మొత్తం రూ.200 కోట్లను బటన్ నొక్కి నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేశారు. అనంతరం రైతులను ఉద్దేశించి సీఎం వైఎస్ జగన్ మాట్లాడారు. క్రమం తప్పకుండా సున్నావడ్డీ పంటరుణాలు ఖచ్చితంగా ఇవ్వడంతో పాటు ఏ సీజన్‌లో పంట నష్టం జరిగితే ఆ సీజన్ ముగియకమునుపే.. మళ్లీ రైతులు పెట్టుబడి కోసం ఇబ్బంది పడకుండా ఉండేందుకు వారికి ఆ పరిహారం చెల్లిస్తున్నామని సీఎం వైఎస్ జగన్ తెలిపారు. క్రాప్ ఇన్సూరెన్స్ అయితే మరలా మరుసటి ఏడాది ఆ సీజన్ రాకమునుపే క్రమం తప్పకుండా ఒక కొత్త ఒరవడిని తీసుకొచ్చి.. వ్యవసాయ రంగంలో చాలా రకాలైన మార్పులకు ఈ 3 ఏళ్ల 5 నెలల కాలంలో అడుగులు వేశామని సీఎం వైఎస్ జగన్ తెలిపారు.
రైతుల ఖాతాల్లో రూ.200 కోట్లు జమ
'2022 జూలై నుంచి అక్టోబరు మధ్యలో కురిసిన అధిక వర్షాలు, వరదల వలన దాదాదపు 45,998 మంది వ్యవసాయ, ఉద్యానవన రైతులకు నష్టం జరిగింది. దీని వల్ల రైతులు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో దాదపుగా రూ.40 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీని నేడు జమ చేస్తున్నాం' అని సీఎం వైఎస్ జగన్ తెలిపారు. ఏ సీజన్‌లో పంట నష్టం జరిగితో ఆ సీజన్ కంటే ముందే చెల్లిస్తున్నామని తెలిపారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి ఇప్పటి వరకూ ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయిన దాదాపు 21,31,000 మంది రైతులుకు ఇన్‌పుట్ సబ్సిడీ రూ.1834 కోట్లు చెల్లించామని సీఎం వైఎస్ జగన్ చెప్పారు. మరోవైపు పంటలు వేసే ప్రతిసారీ రైతన్నలు పెట్టుబడి కోసం బ్యాంకులు, వడ్డీ వ్యాపారుల చుట్టూ తిరగాల్సిన పని లేకుండా ఉండేందుకు వైఎస్ఆర్ సున్నావడ్డీ ద్వారా రుణాలు ఇస్తున్నట్లు జగన్ తెలిపారు. ఇందులో భాగంగానే రబీకు సంబంధించి, ఖరీఫ్ 2021 సంబంధించి రుణాలు తీసుకుని సకాలంలో చెల్లించిన 8,22,411 మంది రైతులకు ఈరోజు రూ.160. 55కోట్ల వడ్డీ రాయితీ సొమ్మను నేరుగా వారి ఖాతాల్లో జమ చేసినట్లు సీఎం జగన్ స్పష్టం చేశారు.
అన్నదాతలకు అండగా..
అన్నదాతలకు అండగా నిలుస్తూ ఇ– క్రాప్ డేటా ఆధారంగా పారదర్శకంగా రుణాలు ఇస్తున్నట్లు సీఎం వైఎస్ జగన్ తెలిపారు. లక్ష రూపాయలు లోపు రుణాలు తీసుకుని, ఏడాదిలోపు తిరిగి చెల్లించిన రైతులందరికీ కూడా పూర్తి వడ్డీ రాయితీని మనందరి ప్రభుత్వం క్రమం తప్పకుండా ఇస్తుంది అని చెప్పుకొచ్చారు. రూ.160.55 కోట్లతో కలిపితే మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చంద్రబాబు హాయంలో ఆయన ఎగ్గొట్టిన బకాయిలతో కూడా కలుపుకుంటే సున్నావడ్డీ పథకం కింద 73.88 లక్షల మంది రైతులకు రూ.1834.55 కోట్లు నేరుగా రైతన్నల ఖాతాల్లో జమ చేసినట్లు సీఎం వైఎస్ జగన్ తెలిపారు.
చంద్రబాబు పాలనలో కరువు
రూ.87,612 కోట్ల వ్యవసాయ రుణాలు అన్నీ రైతులందరికీ మాఫీ చేస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు నమ్మించి మోసం చేశారు. బ్యాంకుల్లో ఉన్న బంగారం అంతా ఇంటికి తిరిగి రావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలని టీడీపీ ప్రచారం చేసింది. అధికారంలోకి వచ్చిన తర్వాత రుణ మాఫీ చేయకుండా మోసం చేశాడు' అని సీఎం వైఎస్ జగన్ ఆరోపించారు. చివరికి ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కేవలం రూ.15వేల కోట్లు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకున్నాడు అని సీఎం జగన్ ఆరోపించారు. చంద్రబాబు ఐదేళ్లలో వరుసగా కరువు వచ్చింది. ప్రతి సీజన్‌లోనూ కరువు మండలాలు డిక్లేర్ అవుతుండేవి. అలాంటి పరిస్థితుల్లో ఇన్సూరెన్స్ సొమ్ము కూడా చెల్లించలేదు అని సీఎం జగన్ ఆరోపించారు.
విత్తనం నుంచి అమ్మకం వరకూ..
'విత్తనం నుంచి అమ్మకం వరకూ రైతన్నకు అండగా ఉండే ఆర్బీకేలు ప్రతి గ్రామంలోనూ కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో 10,778 రైతు భరోసా కేంద్రాలు ప్రతి గ్రామంలోనూ రైతన్నకు నాణ్యమైన, సర్టిఫైడ్ ఎరువులు, విత్తనాలు, పురుగు మందులు అందిస్తున్నామని సీఎం వైఎస్ జగన్ చెప్పుకొచ్చారు. ఆర్బీకేలు రైతులకు సలహాలు ఇస్తున్నాయి. పారదర్శకంగా ఇ–క్రాప్ నమోదు చేస్తున్నాయని తెలిపారు. విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్లు ఆర్బీకేల ద్వారా సేవలందిస్తున్నారని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజా ప్రతినిధులు, కలెక్టర్లు, ఇతర అధికారులు, రైతులు ఆయా జిల్లాల నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు.