గుర్ల ఘటనపై సీఎం చంద్రబాబు ఆరా.. విచారణకు ఆదేశం

విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గం గుర్లలో అతిసారం ఘటనపై సీఎం చంద్రబాబు మరోసారి సమీక్ష నిర్వహించారు..

Update: 2024-10-20 10:38 GMT

దిశ, వెబ్ డెస్క్: విజయనగరం జిల్లా(Vizianagaram District) చీపురుపల్లి నియోజకవర్గం గుర్లలో అతిసారం(Diarrhea) ప్రబలింది. దీంతో వాంతులు, విరేచనాలతో 8 మంది మృతి చెందారు.100 మందికి పైగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ఈ ఘటనపై సీఎం చంద్రబాబు(CM Chandrababu) ఇప్పటికే ఓసారి సమీక్షించి అధికారులకు పలు సూచనలు చేశారు. తాజాగా మరోసారి కూడా సమీక్ష నిర్వహించారు. గ్రామంలో ప్రస్తుత పరిస్థితి, బాధిత ప్రజలకు అందుతున్న వైద్య సాయంపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. వైద్య శిబిరాలు ఏర్పాటు చేశామని, సురక్షిత తాగునీరు అందజేస్తున్నామని ఈ సందర్భంగా సీఎంకు అధికారులు వివరించారు. అయితే ఘటనకు గల కారణాలపై పూర్తి స్థాయి విచారణ జరపాలని అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశించారు.

మరోవైపు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Deputy CM Pawan Kalyan) సోమవారం విజయనగరం జిల్లాలో పర్యటించనున్నారు. అతిసారం ప్రబలిన గుర్ల ప్రాంతానికి సైతం వెళ్లనున్నారు. ఘటనపై అధికారులను అడిగి తెలుసుకోనున్నారు. గ్రామంలో అందుతున్న వైద్యంపై ఆరా తీయనున్నారు. ఈ మేరకు డిప్యూటీ సీఎం పర్యటనకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. 


Similar News