AP News:పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను పరిశీలించిన సీఎం చంద్రబాబు

రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు పోలవరం ప్రాజెక్టు పనులలో ప్రతి విభాగంలో పనుల ప్రగతిని పరిశీలించారు.

Update: 2024-06-17 08:36 GMT

దిశ,ఏలూరు/పోలవరం: రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు పోలవరం ప్రాజెక్టు పనులలో ప్రతి విభాగంలో పనుల ప్రగతిని పరిశీలించారు. పోలవరం పనుల పరిశీలన నిమిత్తం సోమవారం చంద్రబాబు ముందుగా స్పిల్ వే బ్లాక్ 26 వద్ద పనుల ప్రగతిపై అక్కడ అధికారులు ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ పరిశీలించి పనుల ప్రగతిని ఇంజనీరింగ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం గైడ్ బండ్ , గాప్-3, యుఎస్‌సీడీ, గాప్ -1, గాప్ -2, డీఎస్ఈడీ, వద్ద చేపట్టిన పనుల ప్రస్తుత పరిస్థితిని ఇంజనీరింగ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పవర్ హౌస్ డౌన్ స్ట్రీమ్,అప్ స్ట్రీమ్‌లలో జరుగుతున్న పనులను పరిశీలించారు.

ఒక్కొక్క విభాగం వద్ద 10 నుంచి 15 నిమిషాల వరకు సమయం కేటాయించుకుని, అక్కడ పనుల ప్రగతి, చేపట్టనున్న పనులను గురించి సవివరంగా ఇంజనీరింగ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు.ముఖ్యమంత్రి వెంట ఇరిగేషన్ శాఖ మంత్రి డా. నిమ్మల రామానాయుడు, రాష్ట్ర మంత్రులు కందుల దుర్గేష్, కొలుసు పార్థసారథి, వంగలపూడి అనిత, శాసనసభ్యులు బుచ్చయ్య చౌదరి, చింతమనేని ప్రభాకర్, చిర్రి బాలరాజు, బడేటి రాధాకృష్ణయ్య (చంటి), పత్సమట్ల ధర్మరాజు, బొలిశెట్టి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్,ఎస్పీ డి. మేరీ ప్రశాంతి, జాయింట్ కలెక్టర్ బి. లావణ్య వేణి, ఆర్డీఓ అద్దయ్య తదితరులు సీఎం పర్యటనలో పాల్గొన్నారు.


Similar News