మెట్రో రైలు ప్రాజెక్టు పనుల స్పీడ్ పెంచాలి.. అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశం
విశాఖపట్నం, విజయవాడలో చేపట్టబోయే మెట్రో రైలు ప్రాజెక్టు పనులను త్వరితగతిన చేపట్టాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు.
దిశ, ఏపీ బ్యూరో: విశాఖపట్నం, విజయవాడలో చేపట్టబోయే మెట్రో రైలు ప్రాజెక్టు పనులను త్వరితగతిన చేపట్టాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. పురపాలక శాఖా మంత్రి నారాయణ, సీఆర్డీయే అధికారులతో సీఎం చంద్రబాబు సచివాలయంలో గురువారం సమీక్ష నిర్వహించారు. విశాఖపట్నం మెట్రో ప్రాజెక్టును రెండు ఫేజుల్లో చేపడతామని ఏపీ మెట్రోరైల్ కార్పొరేషన్ ఎండీ రామకృష్ణా రెడ్డి సీఎంకి వివరించారు. ఫేజ్-1లో 46 కిలో మీటర్ల మేర రూ.11,400 కోట్ల వ్యయంతో మెట్రో రైలు నిర్మిస్తామని, తరువాత ఫేజ్-2లో 30 కిలోమీటర్ల మేర రూ.5,734 కోట్లతో మెట్రో రైలు నిర్మిస్తామన్నారు. ఫేజ్-1 మెట్రో రైలు పనులు మొదలు పెట్టి నాలుగేళ్లలోపు పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. అలాగే విజయవాడలో 38 కిలోమీటర్ల మేర రూ.11వేల కోట్లతో చేపట్టబోయే మెట్రో రైలు నిర్మాణ ప్రాజెక్టు పనులను కూడా వేగవంతం చేయాలని సూచించారు.