హల్చల్ చేస్తున్న టీడీపీ, జనసేన ఉమ్మడి సీట్ల జాబితా పై నేతల స్పష్టత
చంద్రబాబు నాయుడు జనసేన పార్టీతో చర్చించకుండా ఏకపక్షంగా అరకు, మండపేట అసెంబ్లీ సీట్లను అధికారికంగా ప్రకటించారు.
దిశ, డైనమిక్ బ్యూరో: నిన్న తెలుదేశం పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జనసేన పార్టీతో చర్చించకుండా ఏకపక్షంగా అరకు, మండపేట అసెంబ్లీ సీట్లను అధికారికంగా ప్రకటించారు. కాగా ఈ అంశంపై స్పందించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టీడీపీ పొత్తు ధర్మాన్ని విస్మరించి రెండు సీట్లను ప్రకటించిన నేపధ్యంలో తాను కూడా రాజోలు, రాజానగరం సీట్లను ఈ రోజు అధికారికంగా ప్రకటించారు. అయితే ఇరు పార్టీ అధినేతలు ఏకపక్షంగా సీట్లను ప్రకటించడమే ఇరు పార్టీలకు తలనొప్పిగా మారింది.
కొందరు గుర్తు తెలియని వ్యక్తులు జనసేన, టీడీపీ ఉమ్మడి సీట్ల జాబితా, అలానే టీడీపీ, జనసేన ఉమ్మడి సీట్ల జాబితా అనే రెండు ఫేక్ జాబితాలను సోషల్ మీడియాలో విడుదల చేశారు. కాగా ఆ జాబితాలు విడుదలైన అతి కొద్ది సమయంలోనే నెట్టింట వైరల్ గా మారాయి. ఈ నేపథ్యంలో స్పందించిన జనసేన పార్టీ X వేదికగా ఓ పోస్ట్ చేసినది. జనసేన అభ్యర్థుల ప్రకటన అంటూ.. జగన్ గ్యాంగ్ చేస్తున్న అసత్య ప్రచారాలను నమ్మకండి.
పార్టీ అభ్యర్థుల ప్రకటన ఏదైనా సరే జనసేన పార్టీ అధికార అకౌంట్ ద్వారా ప్రకటించడం జరుగుతుంది. ఇలాంటి చిల్లర వార్తలు రాయడం మానేసి, చేతనైతే మీ పార్టీ నుండి నాయకులు వెళ్లకుండా చూసుకో జగన్ అని పోస్ట్ లో రాసుకొచ్చారు. అలానే ఆ జాబితాలు ఫేక్ అని ఫోటో అప్లోడ్ చేశారు. ఇక ఇదే విషయం పై వైజాగ్ లో టీడీపీ నేత కూడా స్పందించారు. జాబితాల అంశం పై వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని తెలిపారు.