RK Roja: రాజకీయ జీవితం ముగిసింది.. డ్రామాలు ఆపండి

సింహం ఒక్క అడుగు వెనక్కి వేస్తే ఓడిపోయినట్లు కాదని, రెట్టింపు బలంతో వేటాడటానికి సిద్ధంగా ఉన్నట్లేనని రాష్ట్రపర్యాటక శాఖ మంత్రి ఆర్‌కే రోజా అన్నారు...

Update: 2023-03-26 11:15 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: సింహం ఒక్క అడుగు వెనక్కి వేస్తే ఓడిపోయినట్లు కాదని, రెట్టింపు బలంతో వేటాడటానికి సిద్ధంగా ఉన్నట్లేనని రాష్ట్రపర్యాటక శాఖ మంత్రి ఆర్‌కే రోజా అన్నారు. ఒక్క ఎమ్మెల్సీ స్థానంలో గెలుపొందితే ఏదో సాధించినట్లు సంకలు గుద్దుకోవడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. చిత్తూరులో మంత్రి ఆర్‌కే రోజా ఆదివారం మీడియాతో మాట్లాడారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలుపొందిన ఎమ్మెల్యేలు టీడీపీకి ఓటు వేయడమంటే రాజకీయంగా వారు సూసైడ్ చేసుకున్నట్లేనని చెప్పారు. వైసీపీ నుంచి ఎంపీలు, ఎమ్మెల్యేలు ఎవరు వెళ్లిపోయినా సీఎం జగన్ భయపడరని, కొత్త వారిని తయారు చేసుకుంటారని రోజా క్లారిటీ ఇచ్చారు. గతంలో 23 మంది ఎమ్మెల్యేలు టీడీపీలోకి వెళ్లిపోతే వైఎస్ జగన్ భయపడిపోలేదని, వారి స్థానంలో కొత్తవారిని తయారు చేసుకున్నారని గుర్తు చేశారు. నాడు వైఎస్ జగన్‌ను కాదని అమ్ముడు పోయిన ప్రజాప్రతినిధులు ఇప్పుడు రాజకీయంగా దూరమైపోయారని, చరిత్ర హీనులుగా నిలిచిపోయారని ఆరోపించారు.

ప్రస్తుతం నలుగురు ఎమ్మెల్యేల పరిస్థితి అదేననన్నారు. వైసీపీ ఎప్పటికీ భయపడదని వచ్చే ఎన్నికల్లో175 స్థానాలకు 175 నియోజకవర్గాల్లో గెలుపొందడం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. మరోవైపు వైనాట్ పులివెందుల అంటున్నారని పులివెందుల కాదు కదా పులివెందుల చెక్‌పోస్ట్ తాకే మగాడు ఇంకా పుట్టలేదంటూ మంత్రి ఆర్‌కే రోజా తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

ఇప్పటికైనా డ్రామాలు ఆపండి

సస్పెండ్‌కు గురైన ఎమ్మెల్యేలు ఇప్పుడు కొత్త డ్రామాలు ఆడుతున్నారని మంత్రి రోజా విమర్శించారు. వైసీపీకి ఓటు వేశామంటూ ఇంకా ఎందుకు డ్రామాలు ఆడతారని మండిపడ్డారు. తల్లిపాలు తాగి రొమ్ము గుద్దిన వారికి మాట్లాడే అర్హత లేదన్నారు. అమ్ముడుపోయిన వైసీపీ ఎమ్మెల్యేలకు పార్టీలో కానీ ప్రజల్లోకానీ సానుభూతి ఉండదని చెప్పారు. టీడీపీకి ఓటు వేసిన ఎమ్మెల్యేలు నలుగురు వైఎస్ జగన్ జెండా అజెండా, ఛరిష్మాతోనే గెలిచామని గుర్తుంచుకోవాలని హితవు పలికారు. ఇప్పటితో వారి రాజకీయ జీవితం ముగిసిందని, వారి స్థానాల్లో కొత్తవారిని నిలబెట్టి గెలిపించుకునే దమ్ము ధైర్యం వైఎస్ జగన్‌కు ఉందని మంత్రి ఆర్‌కే రోజా స్పష్టం చేశారు.

Tags:    

Similar News