వైసీపీ అధ్యక్షుడిని మార్చినా గెలుపు అసాధ్యం: వైసీపీ ఇన్‌చార్జిల మార్పుపై టీడీపీ
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జిల మార్పునకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే.
దిశ, డైనమిక్ బ్యూరో : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జిల మార్పునకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాలలో 11 నియోజకవర్గాలకు కొత్త ఇన్‌చార్జిలను వైసీపీ నియమించింది. తక్షణమే వారంతా నియోజకవర్గాల వ్యవహారాల పర్యవేక్షణ బాధ్యతలు స్వీకరించాలని ఆదేశించిన సంగతి తెలిసిందే. అయితే నియోజకవర్గాల మార్పుపై టీడీపీ ఘటుగా స్పందించింది. ఓడిపోయే సీట్లను బీసీలకు కట్టబెట్టి వారిని బలిపశువులను చెయ్యాలని సీఎం వైఎస్ జగన్ కుట్రలు చేస్తున్నారని మాజీమంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు అయ్యన్నపాత్రుడు ఆరోపించారు. ఈ మేరకు ట్వీట్ చేశారు.‘నాలుగున్నర ఏళ్లుగా బీసీలను అన్ని రకాలుగా హింసించినా జగన్ కసి చల్లారలేదు. పీకే చిట్టా ప్రకారం వైసీపీ చిత్తు చిత్తుగా ఓడిపోయే సీట్లని బీసీలకు కట్టబెట్టి బీసీలను బలిపశువులను చెయ్యాలని చూస్తున్నారు’అని ఎక్స్ వేదికగా అయ్యన్న పాత్రుడు మండిపడ్డారు.
అధినేతను మార్చినా ఫలితం సున్నాయే: అచ్చెన్నాయుడు, ధూళిపాళ్ల
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇన్‌చార్జిల మార్పుపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు స్పందించారు. ఎంతమంది ఇన్‌చార్జిలను మార్చినా వైసీపీ గెలుపొందడం అసాధ్యమన్నారు. వైసీపీ అధినేతను మార్చినా ఎలాంటి ఫలితాలు ఉండవని ఎద్దేవా చేశారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. ‘వైసీపీ అసెంబ్లీ అభ్యర్థులను కాదు కదా..స్వయంగా ఆ పార్టీ అధ్యక్షుడిని మార్చినా గెలుపు అసాధ్యం. ఇంకా మూడునెలలే’ అని అచ్చెన్నాయుడు ట్వీట్ చేశారు. మరోవైపు పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ సైతం కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ప్రభుత్వాన్ని మార్చాలని ప్రజలు ఎప్పుడో డిసైడ్ అయ్యారని ఇప్పుడు అభ్యర్థులను మార్చినంత మాత్రానా ప్రయోజనం ఏమీ ఉండదని ట్వీట్ చేశారు. ‘మీ ప్రభుత్వాన్ని మార్చాలని ప్రజలు డిసైడ్ అయిన తర్వాత మీరు ఎంతమందిని మార్చినా ఫలితం సున్నా. ప్రజావ్యతిరేకత ఉందని అభ్యర్థులను మార్చుకుంటూ పోతే... పులివెందులతో సహా మెుత్తం 151 మార్చాల్సిందే!’ అని పార్టీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్రకుమార్ స్పష్టం చేశారు.