చంద్రబాబులో ఊహించని మార్పు.. AP సీఎం నిర్ణయాలపై ప్రశంశల జల్లు..!

ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలనే సామెత ఉంది. ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడులో ఈ మార్పు స్పష్టంగా కనిపిస్తోంది.

Update: 2024-06-14 02:57 GMT

దిశ, ఏపీ బ్యూరో: ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలనే సామెత ఉంది. ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడులో ఈ మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ప్రమాణ స్వీకారానికి ముందు నుంచే ఆయన నిర్ణయాలపై సగటు ప్రజలు ప్రశంశల జల్లు కురిపిస్తున్నారు. ప్రతీ అంశంలోనూ ప్రచారం కోరుకునే చంద్రబాబేనా ఈయన అంటూ జనం ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు మరో స్టాలిన్‌లా ఎదుగుతారంటూ అప్పుడే సామాజిక మాధ్యమాల్లో పోస్టులు దర్శనమిస్తున్నాయి.

చిక్కీలపైనా జగన్ బొమ్మ

మాజీ సీఎం వైఎస్ జగన్ ఏ నిర్ణయం తీసుకున్నా అందులో తప్పనిసరిగా ఆయన ప్రచారాన్ని ఆశించారు. ఆ దిశగా నిర్ణయాలు తీసుకున్నారు. చివరకు పసిపిల్లలకు ఇచ్చే చిక్కీల దగ్గర నుంచి స్కూలు బ్యాగుపై కూడా ఆయన బొమ్మ వేసుకున్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి కాగానే చిక్కీలపై జగన్ బొమ్మ తొలగించి తన ముఖ చిత్రం వేసుకోలేదు. ప్రభుత్వ ముద్ర వేయించారు. అంతేకాదు.. స్కూలు బ్యాగులపై జగన్​బొమ్మ ఉన్నా పర్లేదు.. విద్యార్థులకు స్టూడెంట్ కిట్ల పేరుతో పంపిణీ చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ సొమ్ము వృథా చేయరాదని భావించారు.

ట్రాఫిక్‌కు అంతరాయం కల్గించొద్దు

మొన్నటికి మొన్న ప్రధాని మోడీ ప్రమాణస్వీకారానికి ఢిల్లీ బయల్దేరినప్పుడు పోలీసులు నానా హడావుడి చేశారు. కరకట్ట నుంచి గన్నవరం విమానాశ్రయం వరకు ట్రాఫిక్​మొత్తాన్ని నిలిపేశారు. ఇది గమనించిన చంద్రబాబు పోలీసుల తీరును ఆక్షేపించారు. ట్రాఫిక్‌ను ఫ్రీగా వదిలేయాలని సీఎస్‌వోను ఆదేశించారు. తన వల్ల పబ్లిక్​ఇబ్బందులు పడకూడదని హితవు పలికారు. అదే జగన్​బయటకు హెలికాప్టర్‌లో వస్తుంటేనే రోడ్ల మీద పోలీసులు గంటలకొద్దీ ట్రాఫిక్​నిలిపి ప్రజలకు చుక్కలు చూపించారు. ఈ విషయంలో చంద్రబాబుపై ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.

పరదాలు కట్టొద్దు

తాజాగా సీఎం చంద్రబాబు కుటుంబ సమేతంగా తిరుమల వెళ్తే అధికారులు ఇరువైపులా పరదాలు కట్టించారు. దీనిపై చంద్రబాబు విస్మయం వ్యక్తం చేశారు. ప్రజలకు తనను దూరం చేసే ఇలాంటి చర్యలకు పాల్పడవద్దని సుతిమెత్తగా హెచ్చరించారు. పరదాల ముఖ్యమంత్రి చంద్రబాబు కాదని లోకేశ్ సెటైర్లు విసిరారు. ఇలా చంద్రబాబు తీసుకుంటున్న ఒక్కో నిర్ణయంతో పొరుగునున్న తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌లా ఎదుగుతున్నారంటూ సోషల్ మీడియాలో పోస్టులు దర్శనమిస్తున్నాయి. రాజకీయాల్లో ఉన్నత ప్రమాణాలు నెలకొల్పే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు హుందాతనంగా అడుగులు వేస్తారని తమ్ముళ్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.


Similar News