‘అసెంబ్లీ సమావేశాలకు చంద్రబాబు హాజరు కావాలి’

అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు చంద్రబాబు గైర్హాజరవ్వడంపై ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Update: 2023-03-14 12:19 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గైర్హాజరవ్వడంపై ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్షం లేవనెత్తే ప్రతి అంశంపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని వెల్లడించారు. ప్రతిపక్ష నేత చంద్రబాబును కూడా అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలకు రావాలని ఆహ్వానిస్తున్నట్లు వెల్లడించారు. అసెంబ్లీ సమావేశాలకు బాధ్యత కలిగిన ప్రతిపక్ష నేతగా చంద్రబాబు తప్పక హాజరుకావాలని కోరారు.

14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పని చేసిన చంద్రబాబుకు అసెంబ్లీ సమావేశాలకు హాజరై ప్రజా సమస్యలపై చర్చించాలన్న ఆలోచన లేకపోవడం బాధాకరమన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ప్రభుత్వ చీఫ్‌ విప్‌ ముదునూరి ప్రసాదరాజు మీడియాతో మాట్లాడారు. గవర్నర్‌ ప్రసంగంతో ఏపీ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు మంగళవారం నుంచి ప్రారంభమయ్యాయని చెప్పుకొచ్చారు.

ఈనెల 24 వరకు అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయని చెప్పుకొచ్చారు. తొమ్మిది రోజుల పాటు జరిగే ఈ అసెంబ్లీ సమావేశాల్లో ఈనెల 16న బడ్జెట్ ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. బుధవారం గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. ఇకపోతే 22న ఉగాది పండుగ సంద‌ర్భంగా అసెంబ్లీకి సెలవు ఉంటుందని చెప్పుకొచ్చారు. సంక్షేమ, అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్నట్లు ప్రభుత్వ చీఫ్ విప్ ప్రసాదరాజు స్పష్టం చేశారు.

Tags:    

Similar News