ఇబ్బందులు అధిగమించిన చంద్రబాబు.. ఆచితూచి అభ్యర్థుల ఫైనల్
రానున్న ఎన్నికల్లో పోటీ చేయనున్న తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు దాదాపు ఖరారయ్యారు. పొత్తులో భాగంగా తెలుగుదేశం 144 అసెంబ్లీ, 17 పార్లమెంటు స్థానాల్లో పోటీ చేయనుంది.
దిశ ప్రతినిధి, విశాఖపట్నం: రానున్న ఎన్నికల్లో పోటీ చేయనున్న తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు దాదాపు ఖరారయ్యారు. పొత్తులో భాగంగా తెలుగుదేశం 144 అసెంబ్లీ, 17 పార్లమెంటు స్థానాల్లో పోటీ చేయనుంది. తాజాగా శుక్రవారం తెలుగుదేశం మూడో జాబితాలో 11 శాసనసభా స్థానాలు, 13 లోక్ సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. మరో ఐదు అసెంబ్లీ, నాలుగు ఎంపీ అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. చర్చలు, సంప్రదింపులు, బుజ్జగింపులు, హామీలతో చంద్రబాబు, నారా లోకేశ్‌లు అభ్యర్థుల ప్రకటనలో ఇబ్బందులను అధిగమించారు. దాదాపు అభ్యర్థుల ప్రకటన పూర్తి అయినప్పటికీ అసమ్మతి తలెత్తకుండా జాగ్రత్త పడ్డారు.
పొత్తు కారణంగా సీట్లు పోయినా లీడర్ జారిపోలేదు
పొత్తు కారణంగా 31 అసెంబ్లీ సీట్లను, 8 లోక్‌సభ సీట్లను తెలుగుదేశం కోల్పోయింది. ఎంపీ సీట్ల వల్ల పెద్దగా ఇబ్బందులు లేకపోయినా అసెంబ్లీ అభ్యర్థుల విషయంలో తీవ్ర సమస్యలు తలెత్తుతాయని భావించారు. తెలుగుదేశం పార్టీ అసెంబ్లీకి ఒక నియోజక వర్గ ఇన్చార్జిని పెట్టి పనిచేయడం, చంద్రబాబు జైలులో ఉన్న రెండు నెలల పాటు వారు రోజు కార్యక్రమాలు నిర్వహించడం, లోకేష్ యుగవళం, శంఖారావం సభలు నియోజక వర్గం యూనిట్‌గా జరగడంతో వారే అసెంబ్లీ అభ్యర్థులుగా ప్రొజెక్టు అయ్యారు. లక్షలు, కోట్లలో ఖర్చు చేశారు. పోలీసు కేసులు, అరెస్టులు ఎదుర్కొని నిలిచారు. అటువంటి వారికి టికెట్ రాకపోతే గోల గోల అవుతుందని, పెద్ద సంఖ్యలో పార్టీ వీడతారని భావించారు. అయితే,అందుకు విరుద్ధంగా టికెట్ వచ్చినా మిత్ర పక్షాల అభ్యర్థులతో కలసి పనిచేసేందుకు వీరిలో చాలా మంది సిద్ధమయ్యారు.
సామాజిక సమీకరణలలోనూ జాగ్రత్తలు
తెలుగుదేశం పార్టీ కమ్మసామాజిక వర్గానికి న్యాయం చేస్తూనే తన బీసీ మార్కును నిలబెట్టుకొంది. బీసీలు, కాపులు దూరం కాకుండా జాగ్రత్తలు పడింది. కూటమి పక్షాలు ఏయే సామాజిక వర్గాలకు సీట్లు ఇస్తున్నాయో చూసుకొని తమ సీట్ల విషయంలో తెలుగుదేశం జాగ్రత్తలు పడింది. దీంతో ఎక్కడా పెద్దగా ఇబ్బందులు ఎదురుకాలేదు.
మరికొన్ని మార్పులు
ప్రకటించిన అభ్యర్థులలో కొన్ని మార్పులు వుండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రకటించిన అభ్యర్థులే ఫైనల్ కాదని వారం వారం వారి పనితీరును సమీక్షించి అవసరమనుకొంటే మార్పులు చేస్తామని స్వయంగా చంద్రబాబు ప్రకటించారు. ప్రత్యర్థి వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థులు గట్టిగా ఖర్చు పెట్టే అవకాశం వున్నందున జనరల్ సీట్లలో తెలుగుదేశం కూడా ఆర్థికంగా పటిష్టమైన వారికే ప్రాధాన్యత ఇచ్చింది. కొందరు అభ్యర్థుల హామీ ఇచ్చిన మేరకు నిధులు సమకూర్చుకోలేకపోతున్నారని నివేదికలు వస్తున్నాయి. మరి కొందరు యాక్టివ్‌గా పనిచేయలేకపోతున్నారు. వీటన్నింటినీ బేరీజు వేసుకొని కనీసం పది మంది అసెంబ్లీ అభ్యర్థులను మార్చే అవకాశం వుందని ప్రచారం జరుగుతోంది.