Chandrababu: అభ్యర్థి ఎవరు అనేది కాదు...జెండా గెలవాలి
అభ్యర్థి ఎవరు అనేది కాదు...జెండా గెలవాలి అని చూడండని టీడీపీ నేతలకు, కార్యకర్తలకు ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సూచించారు...
దిశ, డైనమిక్ బ్యూరో: అభ్యర్థి ఎవరు అనేది కాదు...జెండా గెలవాలి అని చూడండని టీడీపీ నేతలకు, కార్యకర్తలకు ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సూచించారు. విశాఖలో జరిగిన పార్టీ జోన్ 1 సమావేశంలో పాల్గొన్న చంద్రబాబు నాయుడు పార్టీ నేతలకు హితబోధ చేశారు. ‘తెలుగు దేశం పార్టీలో నేతలు అందరినీ కలుపుకుని పోవాలి. కొందరు పార్టీలో విభేదాలు సృష్టించాలని చూస్తున్నారు. విభేదాలు సృష్టించిన నేతలకు పదవులు రావు, పార్టీలో గ్రూపులు పెట్టిన వారికి పదవులు రావు’ అని చంద్రబాబు తెగేసి చెప్పారు. ‘పార్టీలో త్యాగాలు చేసిన వారికి, పనిచేసిన వారికి పదవులు వస్తాయి అని హామీ ఇచ్చారు. నాలుగేళ్లు పోరాడారు....మీ త్యాగాలు మరిచిపోం. అయితే పార్టీ బలోపేతం కోసం బయట వాళ్ల వస్తే పార్టీలో చేర్చుకోండి. మొదటి ప్రాధాన్యం పార్టీలో ముందు నుంచి ఉన్నవారికే...ఆ తరువాతనే పార్టీలో చేరే వారికి ప్రాధాన్యం. వచ్చే ఎన్నికల్లో 40 శాతం సీట్లు యువతకు ఇస్తాం. ఈ సారి ముందుగానే అభ్యర్థుల ప్రకటన ఉంటుంది. ఆమేరకు ప్రయత్నం చేస్తున్నా’ అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వెల్లడించారు.
దేశంలోనే రిచ్చెస్ట్ సీఎం
‘దేశంలో రిచ్చెస్ట్ సీఎంగా ఉన్న జగన్....తాను పేదల మనిషి అంటున్నారు. వర్గ పోరు అని కొత్త మాటలు చెపుతున్నారు. ఊరు ఊరుకూ ప్యాలెస్ కట్టుకున్న వ్యక్తి పేదల వ్యక్తా. పేదలకు ఒక్క ఇల్లు కట్టని వ్యక్తి పేదల వ్యక్తా’ అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. రాష్ట్రంలో రైతు బజార్‌లు తాకట్టు పెట్టి అప్పులు తెచ్చిన సీఎం జగన్ అని ఆరోపించారు. ‘నాడు విశాఖ ఉక్కు విషయంలో పోరాడి సమస్యను పరిష్కరించాం. నాడు ప్రైవేటీ కరణకు అడ్డుపడ్డాం. ఢిల్లీ మెడలు వంచుతా అని చెప్పిన ముఖ్యమంత్రి ఢిల్లీ ఎందుకు వెళుతున్నారు. ప్రత్యేక హోదా వచ్చిందా?. గిరిజన యూనివర్సిటీ ప్రారంభం అయ్యిందా?....పోలవరం పూర్తి అయ్యిందా?....రైల్వే జోన్ డిమాండ్ పూర్తిగా నెరవేరిందా?....సీఎం ఢిల్లీ ఎందుకు వెళుతున్నారు.’ అని చంద్రబాబు ప్రశ్నల వర్షం కురిపించారు. ‘జగనే మా భవిష్యత్ అని ఇప్పుడు స్టిక్కర్లు వేస్తారట. జగన్ మన భవిష్యత్ కాదు. జగనే మన దరిద్రం. మనకు శాపం.’ అని చంద్రబాబు విమర్శించారు.
ఎమ్మెల్సీ ఎన్నికలతో జగన్ మైండ్ బ్లాక్ అయ్యింది
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు ఎప్పుడూ విశాఖపై ప్రేమ లేదని చంద్రబాబు విమర్శించారు. విశాఖ భూములు, ఆస్తులపైనే ప్రేమ అని ఎద్దేవా చేశారు. ‘ఎప్పుడు ఎన్నికలు వచ్చినా జగన్ గెలిచే అవకాశమే లేదు. మొన్నటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో జగన్ మైండ్ బ్లాక్ అయ్యి...ఇప్పుడు ఎమ్మెల్యేలను గౌరవిస్తా అంటున్నారు. ఈ నాలుగేళ్లు తెలుగుదేశం పార్టీ కోసం పోరాడిన కార్యకర్తలకు శిరసు వంచి ధన్యవాదాలు తెలుపుతున్నా. పట్టభద్రుల ఎన్నికల్లో తిరుగుబాటు. వచ్చే ఎన్నికల్లో ప్రజా తిరుగుబాటు అవుతుంది. మేం 175 స్థానాల్లో పోటీ చేస్తామా లేదా అనేది మీకు ఎందుకు చెప్పాలి. మేం 175లో వైసీపీని ఓడిస్తాం. పులివెందులలో కూడా జగన్‌ను ఓడిస్తాం. అచ్చెన్నాయుడితో మొదలు పెట్టి అందరిపై తప్పుడు కేసులు పెట్టారు. ఎన్ని కేసులు పెట్టినా క్యాడర్, లీడర్లు భయపడలేదు. ఎన్ని కేసులు పెట్టినా పార్టీ పోరాటం ఆగదు.’ అని చంద్రబాబు స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి: