Chandrababu: అంజన్ ఆచూకీ తెలపకపోవడం దుర్మార్గం
గన్నవరం ఎన్ఆర్ఐ యువకుడు పొందూరి కోటిరత్నం అంజన్ అక్రమ నిర్బంధంపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు..
దిశ, డైనమిక్ బ్యూరో : గన్నవరం ఎన్ఆర్ఐ యువకుడు పొందూరి కోటిరత్నం అంజన్ అక్రమ నిర్బంధంపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు అక్రమంగా నిర్బంధించిన అంజన్‌ను వెంటనే విడుదల చేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. సీఎంపై పోస్ట్ పెట్టాడని పొందూరి కోటిరత్నం అంజన్‌ను బుధవారం తీసుకువెళ్లిన పోలీసులు ఇప్పటికీ ఆచూకీ చెప్పకపోవడం నిబంధనల ఉల్లంఘనేనన్నారు. వెంటనే తప్పుడు అధికారులపై డీజీపీ చర్యలు తీసుకోవాలని, లేకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. ఇదిలా ఉంటే అంజన్ ఎక్కడ ఉన్నాడనే దానిపై తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. పోలీస్ స్టేషన్ల చుట్టూ తాము తిరుగుతున్నా పోలీసులు సమాధానం చెప్పడం లేదని అంజన్ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.
సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడని..
రాయ్‌నగర్‌కు చెందిన ప్రవాసాంధ్రుడు పొందూరి కోటిరత్నం అంజన్ అమెరికాలో పీజీ, ఉద్యోగం చేసి ఇటీవలే స్వగ్రామానికి వెళ్లారు. అయితే బుధవారం ఉదయం 6గంటల సమయంలో సోషల్ మీడియాలో సీఎం వైఎస్ జగన్‌కు, వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అసభ్యకర పోస్టులు పెడుతున్నాడని ఆరోపిస్తూ పది మంది పోలీసులు మఫ్టీలో తమ కుమారుడిని తీసుకెళ్లారని తల్లిదండ్రులు అంటున్నారు. వీర్వో రకీబ్, వీఆర్ఏ రామకృష్ణలతో కలిసి ఎస్ఐ రమేశ్, శ్రీనివాస్ మరికొందరు పోలీసులు నిద్రిస్తున్న అంజన్‌ను తీసుకెళ్లారని తల్లిదండ్రులు తెలిపారు.అంజన్ సెల్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు, బ్యాంకు ఖాతా పుస్తకాలు, తన సెల్‌ఫోన్‌ను సైతం పోలీసులు తీసుకెళ్లారని తల్లి రత్నకుమారి వాపోయారు. తొలుత గన్నవరం పోలీస్ స్టేషన్ అనంతరం ఉంగుటూరు పోలీస్ స్టేషన్లకు తరలించారని చెప్పారు. తమ కుమారుడికి ఏం జరిగినా పోలీసులదే బాధ్యత అని తల్లి రత్నకుమారి ఆరోపించారు. ఇదిలా ఉంటే వైసీపీ టీడీపీ పోల్స్‌కు సంబంధించిన పోస్టును అంజన్ తన ట్విటర్ ఖాతాలో పెట్టినట్లు తెలుస్తోంది. దీనిపై గన్నవరం శ్రీనగర్‌కు చెందిన ప్రతాప్ అనే వ్యక్తి ఫిర్యాదు చేయడంతో పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది.