Breaking News: పల్నాడు ఎస్పి పై కేంద్రం సీరియస్.. కారణం ఇదే..!
చిలకలూరి పేట బొప్పూడి వద్ద ఈ నెల 17న ఆదివారం ప్రధాని నరేంద్ర మోడి పాల్గొన్న ప్రజాగళం సభలో చోటు చేసుకున్న పరిణామాలపై కేంద్రం ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది.
దిశ ప్రతినిధి.గుంటూరు: చిలకలూరి పేట బొప్పూడి వద్ద ఈ నెల 17న ఆదివారం ప్రధాని నరేంద్ర మోడి పాల్గొన్న ప్రజాగళం సభలో చోటు చేసుకున్న పరిణామాలపై కేంద్రం ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా హై ప్రొటోకాల్ తో ఏర్పాట్లు చేయాల్సి ఉండగా.. పల్నాడు జిల్లా పోలీసులు లైట్ తీసుకోవడం, దీంతో సభలో ప్రధాని మోడీ స్వయంగా జోక్యం చేసుకోవాల్సిన పరిస్దితులు రావడంపై సర్వత్రా విమర్శలు వచ్చాయి.
ఈ నేపథ్యంలో కేంద్రం ఆదేశాలతో ఎన్డీయే కూటమి నేతలు నిన్న ఈసీకి ఫిర్యాదు చేశారు. పల్నాడు సభలో శాంతి భద్రతల నియంత్రణలో పోలీసుల వైఫల్యం స్పష్టంగా కనిపించింది. ప్రధాని సభకు గుంటూరు రేంజ్ కు చెందిన ఇద్దరు ఎస్పీలతో పాటు విశాఖ రేంజ్ కు చెందిన మరో ఎస్పీకి కూడా బాధ్యతలు అప్పగించారు. కానీ సభ జరుగుతున్న సమయంలో వాటర్ బాటిళ్లు గ్యాలరీల్లోకి విసరడం, ప్రజలు లైట్ టవర్స్ ఎక్కేయడం, మైక్ సెట్ పైకి జనం దూసుకురావడం, ప్రధాని ఉన్న సమయంలోనే ఇటువంటి ఘటనలు జరిగిన అంశాలపై కేంద్ర నిఘా సంస్ధలు నివేదిక ఇచ్చాయి.
వీటిపై ఇప్పుడు ఈసీ తదుపరి చర్యలకు సిద్దమవుతోందని సమాచారం. కేంద్రం సూచన మేరకు ఎన్డీయే నేతలు రాష్ట్రంలో ముఖ్య ఎన్నికల అధికారి అయిన ముకేష్ కుమార్ మీనాకు ఫిర్యాదు చేయడంతో ఆయన క్షేత్రస్దాయి నుంచి నివేదికలు తెప్పించుకున్నారు. ముగ్గురు ఎస్ పి ల తో రాష్ట్ర ఎన్నికల అధికారి ముకేష్ కుమార్ మీనా గురువారం ప్రధాని సభ అంశాలతోపాటు ఆయా జిల్లాల్లో శాంతి భద్రతల అంశాల పై విడివిడిగా చర్చించారు.
అన్ని విషయాల పై సమగ్ర నివేదికను ఇప్పటికే ఈసీకి పంపి చర్యలకు సిఫార్సు చేసినట్టు సమాచారం.ఇందులో ముఖ్యంగా స్ధానిక పల్నాడు జిల్లా ఎస్పీ రవిశంకర్ రెడ్డిపై చర్యలకు సిఫార్సు చేశారని అధికార వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. దీని ఆధారంగా ఈసీ వేటు వేసే అవకాశాలు ఉన్నట్లు ఎన్డీయే వర్గాలు చెబుతున్నాయి. ప్రధాని సభకు తగిన ప్రోటోకాల్ ఏర్పాట్లు చేయకపోవడం, భారీ ఎత్తున జనం వస్తారని తెలిసినా వారిని నియంత్రించేందుకు తగిన ఏర్పాట్లు చేసుకోకపోవడం, ప్రధాని మోడీ నేరుగా జోక్యం చేసుకుని హెచ్చరిస్తున్నా జనం లైటింగ్ టవర్స్, మైక్ సెట్ ల నుంచి దూరంగా వెళ్లకపోవడం వంటి పరిణామాల్ని తీవ్ర భద్రతా లోపాలుగానే పరిగణిస్తున్నట్లు తెలుస్తోంది.
దీంతో అందుకు బాధ్యులైన అధికారులపై వేటు వేసేలా ఈసీ చర్యలు తీసుకుంటుందని అధికార వర్గాలు చెప్పుకోస్తున్నాయి. మొత్తం మీద ఈ వ్యవహారాలపై ఈసి ఎలాంటి చర్యలు తీసుకుంటుందో అన్న ఆందోళన సంభందిత పోలీస్ వర్గాల్లో నెలకొందని సమాచారం.