Vangaveeti Radha Krishna :వంగవీటి ఫ్యామిలీలో సంబరాలు:పెళ్లి పీటలెక్కనున్న రాధా

వంగవీటి ఫ్యామిలీలో అంబరాలు సంబరాన్నంటనున్నాయి.

Update: 2023-08-16 06:13 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : వంగవీటి ఫ్యామిలీలో అంబరాలు సంబరాన్నంటనున్నాయి. త్వరలో పెళ్లి బాజాలు మోగనున్నాయి. ద మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ అయిన వంగవీటి రాధా పెళ్లి పీటలెక్కబోతున్నారు. దీంతో వంగవీటి అభిమానుల్లో జోష్ నెలకొంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కీలక నేత వంగవీటి రాధా కృష్ణ. ముఖ్యంగా విజయవాడ వాసుల ప్రియతమ నేత. గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన వంగవీటి రాధాకృష్ణ ప్రస్తుతం టీడీపీలో ఉన్నారు. ఇప్పటి వరకు పెళ్లి చేసుకోలేదు. వంగవీటి రాధా పెళ్లెప్పుడు చేసుకుంటారని కుటుంబ సభ్యులతో పాటు బంధువులు సైతం ఆశగా ఎదురు చూస్తున్నారు. అయితే ఆ సమయం రానే వచ్చింది. త్వరలోనే వంగవీటి రాధా పెళ్ళి చేసుకోబోతున్నారు. నర్సాపురం పట్టణానికి చెందిన యువతితో రాధాకృష్ణకు వివాహం నిశ్చయమైంది. వంగవీటి రాధా స్నేహితుడి బంధువుల అమ్మాయితో రాధా పెళ్లి నిశ్చయమైనట్లు తెలుస్తోంది.

ఈనెల 19న నిశ్చితార్థం

ఈ నెల 19న నర్సాపురంలో వంగవీటి రాధా పెద్దల సమక్షంలో నిశ్చితార్థం చేసుకోనున్నారు. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లుపూర్తి అయ్యాయి. ఎంగేజ్‌మెంట్ అనంతరం సెప్టెంబర్‌లో పెళ్లి ముహూర్తం ఫిక్స్ చేశారు కుటుంబ పెద్దలు. వంగవీటి రాధా ఇక పెళ్లి చేసుకోరు అనుకుంటున్న సమయంలో పెళ్లిపీటలెక్కబోతున్నారన్న వార్తతో బంధువులు సైతం సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక బెజవాడ వాసులు అయితే ఆశ్చర్యపోతున్నారు. వంగవీటి రంగా వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చిన వంగవీటి రాధా 2004లో కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. అనంతరం పీఆర్పీ, వైసీపీలలో చేరి పోటీ చేసినా ఓటమి పాలయ్యారు. ప్రస్తుతం వంగవీటి రాధా టీడీపీలో కొనసాగుతున్నారు. ప్రస్తుతం రాధా రాజకీయాల్లో సైలెంట్‌గా ఉన్నారు. రాబోయే రోజుల్లో వంగవీటి రాధా జనేసనలో చేరతారనే టాక్ ఉంది. అది నిజమో అబద్దమో తెలియదు కానీ త్వరలో మాత్రం వంగవీటి రాధా పెళ్లి పీటలెక్కి ఓ ఇంటివాడు కాబోతున్నాడు.

Tags:    

Similar News