కర్మాగార శాఖలో కాసుల పంట..
రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ప్రభుత్వం జీవో నంబర్ 17 విడుదల చేసింది.
కర్మాగార శాఖలో బదిలీల బాగోతం కొనసాగుతోంది. కాయ్ రాజా కాయ్ అంటూ రూ. లక్షలు చేతులు మారుతున్నాయి. సింపుల్ గా రూ.20 లక్షలు చెల్లిస్తే చాలు నచ్చిన చోట పోస్టింగ్. అనుభవం అసలు అవసరం లేదు. ప్రమాదాలు సంభవిస్తాయనే భయం లేదు. కార్మికుల ప్రాణాలు గాలిలో కలిసిపోతాయనే ఆందోళన అంతకన్నా లేదు. కేవలం సొమ్ములు ఉంటే చాలు.. ఎంచక్కా కావాల్సిన చోటకు బదిలీపై వెళ్లొచ్చు. ఆ తర్వాత ఫ్యాక్టరీల నుంచి లంచాలు గుంజుకోవచ్చు. ఇదీ ఫ్యాక్టరీల శాఖలో నడుస్తున్న నయా ట్రెండు. దీనిపై దిశ అందిస్తున్న ప్రత్యేక కథనం.
దిశ, ఉభయ గోదావరి ప్రతినిధి: రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ప్రభుత్వం జీవో నంబర్ 17 విడుదల చేసింది. వివిధ నిబంధనలతో బదిలీలకు అవకాశం కల్పించింది. ఈ నెల 22 నుంచి 31వ తేదీ వరకు బదిలీల ప్రక్రియ పూర్తి చేయాలని స్పష్టం చేసింది. ఈ జీవో ఆధారంగా కర్మాగార శాఖలో అవినీతి రాజ్యమేలుతోంది. బదిలీలు కావాల్సిన వారు పరిశ్రమల శాఖ మంత్రి జయరాం ఇంటి వద్ద సూట్ కేసులతో బారులు తీరుతున్నారు. దీనిని మంత్రి పీఏ కాసులుగా మార్చుకుంటున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
గతంలోనూ బదిలీలలు
గత సంవత్సరం జూన్ లోనూ రాష్ట్ర ప్రభుత్వం బదిలీల ప్రక్రియ చేపట్టింది. నాడు నిబంధనలు పూర్తిగా తుంగలో తొక్కినట్లు అనేక ఆధారాల ద్వారా తెలుస్తోంది. అప్పట్లో బదిలీల విషయంలో లక్షలు చేతులు మారాయి. నాడు అనుభవం లేని అధికారుల వద్ద రూ. 15 నుంచి రూ.20 లక్షల వరకు తీసుకొని నచ్చిన చోట పోస్టింగ్ ఇచ్చారు. వాస్తవానికి ప్రమాదకరమైన ఫ్యాక్టరీలు ఉన్న చోట సంపూర్ణమైన అనుభవం కలిగిన అధికారిని నియమించాల్సి ఉంది. కానీ ఇక్కడ అటువంటి నిబంధనలు పాటించ లేదు. అధిక సొమ్ములు ఇచ్చిన వారికి పోస్టింగ్ ఇచ్చారు.
నిబంధనలకు విరుద్ధంగా..
శ్రీకాకుళం అధికారికి విశాఖ నగరం ఇన్చార్జిగా ఇచ్చారు. ఆయన శ్రీకాకుళం నుంచి దాదాపుగా 200 కిలోమీటర్లు పయనించాల్సి ఉంది. దీంతో అనేక ప్రమాదాలు సంభవించినా పట్టించుకొనే నాధుడు లేడు. అదే విధంగా చిత్తూరుకు చెందిన అధికారిని నెల్లూరు పంపించారు. ఆయన్ను కూడా ఇన్చార్జిగా నియమించడంతో దాదాపుగా 250 కిలోమీట్లరు పయనించాల్సి ఉంది. అత్యధిక పరిశ్రమలు ఉన్న ఉమ్మడి తూర్పు గోదావరి, విశాఖ నగరం వంటి చోట్ల కనీస అనుభవం లేని అధికారులను వేశారు. దీంతో గతంలో ప్యారీ షుగర్, అంబటి సుబ్బన్న వంటి కంపెనీల్లో పెద్ద పెద్ద ప్రమాదాలు సంభవించాయి. అయినా సంబంధిత శాఖ కాసులకే ప్రాధాన్యమిస్తోంది. ఈ సారైనా నిబంధనలు పాటించి అనుభవం గల అధికారులను అత్యధిక ప్యాక్టరీలున్న చోట వేయాలని అనేక మంది కోరుతున్నారు.