మా ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా చంద్రబాబుపై కేసులా?: దగ్గుబాటి పురంధేశ్వరి
మద్యంపై సమాధానం చెప్పుకుండా కేసులా? అని ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు.
దిశ, డైనమిక్ బ్యూరో : మద్యంపై సమాధానం చెప్పుకుండా కేసులా? అని ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. మద్యం కుంభకోణంపై తమ ప్రశ్నలకు సమాధానం చెప్పుకుండా ఇతరులపై కేసులు పెడుతున్నారని పురంధేశ్వరి మండిపడ్డారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పర్యటించిన ఆమె శుక్రవారం శ్రీకాణిపాక వరసిద్ధి వినాయక స్వామిని దర్శించుకున్నారు. అనంతరం దగ్గుబాటి పురంధేశ్వరి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో బీజేపీ లేవనెత్తిన ప్రశ్నలపై చంద్రబాబు నాయుడుపై కేసులు కడుతున్నారని విమర్శించారు. ఈ రాష్ట్రంలో నిరంకుశ పాలన నడుస్తోందని పురంధేశ్వరి మండిపడ్డారు. తాము లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా ఇతరుల మీద కేసులు పెడుతున్నారంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మద్యంపై తాము లేవనెత్తిన ప్రశ్నలు సమాధానం చెప్పే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని దగ్గుబాటి పురంధేశ్వరి ఆరోపించారు. చంద్రబాబు నాయుడు అరెస్ట్ అక్రమమని తొలుత గళం విప్పింది బీజేపీయేనని పురంధేశ్వరి చెప్పుకొచ్చారు. ఇకపోతే జనసేన పొత్తుపైనా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతానికి ఏపీలో బీజేపీ జనసేన పొత్తులో ఉన్నట్లు చెప్పుకొచ్చారు. అయితే టీడీపీతో పొత్తు విషయం అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని చెప్పుకొచ్చారు. ఎన్నికలకు రెండు మూడు నెలల ముందు ఈ పొత్తులపై అధిష్టానం నిర్ణయం తీసుకుంటారని స్పష్టం చేశారు. ఇకపోతే ఏపీలో ఇసుకను వైసీపీ నేతలు మేసేస్తున్నారని ఆరోపించారు. ట్రాక్టర్లు పెద్దపెద్ద జేసీబీలతో నదుల్లో ఇసుక మైనింగ్ చేస్తున్నారని పురంధేశ్వరి ఆరోపించారు. ఇసుకతవ్వకాల్లో ప్రభుత్వ విధానాలతో 40 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు రోడ్డున పడ్డారని పురంధేశ్వరి ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులతోనే ఏపీ అభివృద్ధి జరుగుతుందని దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు.