Bhuma Vs Silpa : రగులుతున్న నంద్యాల.. భూమా వర్సెస్ శిల్పా!

ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో నంద్యాలలో రాజకీయం ఒక్కసారిగా హీటెక్కింది.

Update: 2023-02-04 09:00 GMT

దిశ, డైనమిక్ బ్యూరో :

ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో నంద్యాలలో రాజకీయం ఒక్కసారిగా హీటెక్కింది. అధికార ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య మాటల తూటలు పేలుతున్నాయి. సవాళ్లు ప్రతిసవాళ్లతో అప్పుడే మినీ ఎలక్షన్ కాంపైన్ స్టార్ట్ అయింది. అవినీతి అక్రమాలపై తేల్చుకుందామా అంటూ నేతలు చేస్తున్న సవాళ్లతో నంద్యాల రాజకీయం రంజుగా మారింది. అవినీతి అక్రమాలు, రాజకీయ ద్వంద్వ వైఖరిపై బహిరంగ చర్చకు రావాలంటూ మాజీమంత్రి భూమా అఖిలప్రియ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిశోర్ రెడ్డికి సవాళ్లు విసిరారు. టైం మీరు చెప్పినా సరే నేను చెప్పినా సరే అని ప్రశ్నించారు.

అవతలి వైపు నుంచి రియాక్షన్ రాకపోవడంతో భూమా అఖిలప్రియనే టైం అండ్ డేట్ ఫిక్స్ చేసేశారు. ఈనెల 4న నంద్యాలలోని గాంధీ చౌక్‌కు వస్తానని నియోజకవర్గంలో అవినీతి అక్రమాలపై ఎమ్మెల్యే రవిచంద్ర కిశోర్ రెడ్డి ఆధారాలతో చర్చకు రావాలని ఛాలెంజ్ విసిరారు. దీంతో ఫిబ్రవరి నాలుగు రానే వచ్చేసింది. అయితే చర్చకు మాజీమంత్రి భూమా అఖిలప్రియ బయలుదేరుతుండగా పోలీసులు అడ్డుకున్నారు. అఖిల ప్రియను హౌస్ అరెస్ట్ చేశారు. దీంతో నంద్యాలలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి.

శిల్పా ఫ్యామిలీపై భూమా సంచలన ఆరోపణలు

నంద్యాల రాజకీయం రసకందాయంలో పడింది. మాజీ మంత్రి భూమా అఖిలప్రియ చేసిన సవాల్‌తో శీతాకాలంలో కూడా నంద్యాలలో ఉక్కపోత మెుదలైంది. ఇటీవలే మాజీమంత్రి భూమా అఖిలప్రియ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిశోర్ రెడ్డి కుటుంబంపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిశోర్ రెడ్డి అక్రమాలకు సంబంధించి తన వద్ద పూర్తి ఆధారాలు ఉన్నాయని భూమా అఖిలప్రియ చెప్పుకొచ్చారు. నంద్యాలలోని గాంధీ చౌక్ వద్దకు ఫిబ్రవరి4న సాయంత్రం 4గంటలకు వస్తానని సవాల్ విసిరారు. అలాగే తాము అక్రమాలకు పాల్పడినట్లు ఉన్న ఆధారాలను నిరూపించాలని డిమాండ్ చేశారు.

ఒకవేళ ఆధారాలతో సహా నిరూపించకపోతే తప్పు ఒప్పుకుని తనకు క్షమాపణ చెప్పాలని భూమా అఖిలప్రియ డిమాండ్ చేశారు. మరోవైపు ఎమ్మెల్యే శిల్ప రవిచంద్రకిశోర్ రెడ్డి కుటుంబం టీడీపీ వైపు చూస్తుందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే టీడీపీ నేతలతో శిల్పా ఫ్యామిలీ టచ్‌లో ఉన్నారని ఏక్షణమైనా టీడీపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని ఆరోపించారు. ఎన్నికల సమయంలో చేరాలని ప్రయత్నాలు చేస్తున్నారని అయితే చంద్రబాబును తిడితే పార్టీలో ఏ విధంగా చేర్చుకుంటారని భూమా అఖిలప్రియ ప్రశ్నించారు.

అఖిల ప్రియ మైండ్ ఆడుతున్నారా..

మాజీమంత్రి భూమా అఖిలప్రియ వ్యాఖ్యలతో నియోజకవర్గంలోని వైసీపీ నాయకత్వం గందరగోళంలో పడిందని తెలుస్తోంది. శిల్పా ఫ్యామిలీ టీడీపీ నేతలతో టచ్‌లో ఉన్నారన్న ఆరోపణలలో వాస్తవం ఉందా అనే అంశంపై చర్చ జరుగుతుంది. ఈ ఆరోపణలపై ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డి వివరణ సైతం ఇచ్చారు. తాము టీడీపీ లోకి వెళ్లాల్సిన అవసరం లేదని శిల్పా చెప్పుకొచ్చారు. మరోవైపు భూమా అఖిలప్రియ ఆరోపణల నేపథ్యంలో వైసీపీ అధిష్టానం కూడా ఆరా తీస్తుందనే వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి.

భూమా అఖిలప్రియ మైండ్ గేమ్ పాలిటిక్స్‌కు పాల్పడుతున్నారా? లేక టీడీపీలో చేరితే తన టికెట్‌కు ఎసరుపెడతారనే దానిపై ముందుగానే లీకులు ఇచ్చారా అన్న చర్చ పొలిటికల్ సర్కిల్‌లో జోరుగా సాగుతుంది. ఇకపోతే భూమా అఖిలప్రియ నంద్యాల నియోజకవర్గంపై కన్నేశారని తెలుస్తోంది. ఇందులో భాగంగానే శిల్పాను టార్గెట్ చేశారని గుసగుసలు వినిపిస్తున్నాయి. మొత్తానికి శిల్పా రవి చంద్రకిశోర్ రెడ్డి, భూమా అఖిలప్రియల ఆరోపణలు, ప్రత్యారోపణలతో నంద్యాల రాజకీయం మాత్రం రసవత్తరంగా మారింది.

భూమా అఖిలప్రియ హౌస్ అరెస్ట్

ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిశోర్ రెడ్డికి మాజీమంత్రి భూమా అఖిలప్రియ సవాల్ విసరడంతో పోలీస్ శాఖ అప్రమత్తమైంది. ముందస్తు చర్యల్లో భాగంగా శనివారం పోలీసులు అఖిల ప్రియను హౌస్ అరెస్ట్ చేశారు. ఆళ్ళగడ్డలోని అఖిల ప్రియ నివాసం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ఆమె ఇంటి నుంచి బయటకు రాకుండా 30 మందికి పైగా సిబ్బందిని నియమించారు. దీంతో అక్కడ టెన్షన్ వాతావరణం చోటుచేసుకుంది. అంతేకాదు శుక్రవారం రాత్రి ఎలాంటి అనుమతి లేకుండా బహిరంగ చర్చకు ఏర్పాట్లు చేశారని పేర్కొంటూ అఖిల ప్రియ పీఏకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. నంద్యాలలో యాక్ట్ 30 అమల్లో ఉన్నందున ఎలాంటి చర్చలకు అనుమతి ఇచ్చేది లేదని తెగేసి చెప్పారు.

READ MORE

Nara Lokesh's Yuvagalam Padayatra.. పలువురిపై హత్యాయత్నం కేసు 

Tags:    

Similar News