BREAKING: ఆంధ్ర రాష్ట్రానికి షర్మిల సీఎం అవ్వడం ఖాయం: సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

ప్రజా సంక్షేమంలో వైఎస్ఆర్ తనదైన ముద్ర వేశారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

Update: 2024-07-08 15:09 GMT

దిశ, వెబ్‌డెస్క్: ప్రజా సంక్షేమంలో వైఎస్ఆర్ తనదైన ముద్ర వేశారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇవాళ వైఎస్ఆర్ 75వ జయంతి సందర్భంగా మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ సెంటర్‌లో నిర్వహించిన సభకు ఆయన హాజరయ్యారు. వైఎస్ఆర్ ఈ లోకానికి దూరమై 15 ఏళ్లు గడస్తున్నా.. ఆయన జ్ఞాపకాలు అందరిలోనూ మెదలుతున్నాయని తెలిపారు. ప్రజ సంక్షేమంలోను ఆయన తనదైన ముద్ర వేశారని అన్నారు. కొత్తగా వచ్చిన వారిని ప్రోత్సహిస్తే పార్టీ మరింత బలపడుతుందని కార్యకర్తలు, నాయకులకు సూచించారు. వైఎస్ఆర్ ఎవరికి ఏ సమస్య వచ్చినా అందరికీ సమయం ఇచ్చి సమస్యలను పరిష్కరించే వారని గుర్తు చేశారు. ఆయన ఎర్రటి ఎండను సైతం లెక్క చేయకుండా పాదయాత్ర చేసి ప్రజల్లోకి వెళ్లారని తెలిపారు. వైఎస్ స్ఫూర్తితోనే రాహుల్ గాంధీ జోడో యాత్రను చేపట్టారని పేర్కొన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో వైఎస్ఆర్‌కు లక్షల్లో అభిమానులు ఉన్నారని తెలిపారు.

రాజకీయాల్లో అనతికాలంలోనే ప్రజాభిమానాన్ని చూరగొన్న వైఎస్ఆర్ లాగా షర్మిల 2029 లో ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రానికి సీఎంగా అవుతారని అన్నారు. దేశంలో రాహుల్ గాంధీ ప్రధాని అయితే, రాష్ట్రంలో షర్మిల ముఖ్యమంత్రి అవుతారంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తండ్రి వైఎస్ ఆర్ ఆశయాలను మోసే వాళ్లనే వారసులుగా గుర్తించాలని, రాహుల్ గాంధీ ప్రధాని అవ్వలన్నదే వైఎస్ఆర్ చివరి కోరిక అని అన్నారు. భవిష్యత్తులో షర్మిల నాయకత్వాన్ని ప్రజలు, వైయస్ అభిమానులు బలపరచాలని ప్రజలకు రేవంత్ పిలుపునిచ్చారు. రాహుల్ గాంధీ మణిపూర్ పర్యటనలో ఉండటం వల్ల సభకు రాలేకపోయారని పేర్కొన్నారు.  


Similar News