ఇప్పటికైనా సిద్ధమా.... విశాఖ డ్రగ్స్ కంటైనర్ కేసుపై బొత్స సంచలన డిమాండ్
విశాఖ డ్రగ్స్ కంటైనర్ కేసుపై బొత్స సంచలన డిమాండ్ చేశారు..
దిశ, వెబ్ డెస్క్: విశాఖ సీపోర్టులో 25 వేల కిలోల డ్రగ్‌ను కంటైనర్ షిప్ తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ కంటైనర్ షిప్‌ను వైసీపీ నేతకు సంబంధించిన సంధ్యా ఆక్వా ఎక్స్ పోర్ట్స్ ప్రైవేటు లిమిటెడ్ కంపెనీ బ్రెజిల్ నుంచి తీసుకొచ్చినట్లు సీబీఐ గుర్తించింది. ఈ ఘటన మార్చి నెలలో జరిగింది. దీంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. అయితే ఆ కేసు ఏమైందని తాజాగా మంత్రి మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. తమ ప్రభుత్వం అధికారంలో ఉండగా జరిగిందని తమపై ఆరోపణలు చేశారని, ఇప్పుడు ఆ ఘటనపై కూటమి సర్కార్ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. అలాగే విశాఖలోని దస్పల్లా భూములపైనా విచారణ చేపట్టాలన్నారు. బ్రిజిల్ నుంచి విశాఖ డ్రగ్స్ తెప్పించిన సంధ్యా ఆక్వా ఎక్స్ పోర్ట్స్ ప్రైవేటు లిమిటెడ్ కంపెనీ బీజేపీ ఎమ్మెల్యే పురంధేశ్వరి బంధువులదేనని చెప్పారు. డ్రగ్ కంటైనర్‌పై ఉత్తరాంధ్ర ఎంపీలు పార్లమెంట్‌లో ప్రశ్నించాలని పిలుపునిచ్చారు. ఎన్డీయే ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే విచారణ చేపట్టి నిందితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేసులో ఎవరున్నా వదిలిపెట్టకూడదని, తాము సైతం విచారణకు సిద్ధంగా ఉన్నామని బొత్స పేర్కొన్నారు.