పొత్తుపై ఎటూ తేల్చని BJP ‘ఢిల్లీ’ పెద్దలు.. చంద్రబాబు ఆ సీట్లు ఇచ్చేందుకు ఒప్పుకోకపోవడమే కారణమా..?
టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు వినాయకుడి పెళ్లి మాదిరిగా వాయిదా పడుతోంది. కమలనాథులను ఒప్పించడానికి తాను కాళ్లు పట్టుకున్నంతగా బతిమాలినట్లు ఇటీవల పవన్వ్యాఖ్యానించారు.
టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు వినాయకుడి పెళ్లి మాదిరిగా వాయిదా పడుతోంది. కమలనాథులను ఒప్పించడానికి తాను కాళ్లు పట్టుకున్నంతగా బతిమాలినట్లు ఇటీవల పవన్వ్యాఖ్యానించారు. పొత్తు ఖరారు కోసం ఆయన ఢిల్లీ పర్యటన రేపు, మాపు అంటున్నా ఇంకా అటు నుంచి పిలుపు రాలేదు. ఈలోగా కాషాయ పార్టీ 26న ఏలూరులో ఎన్నికల శంఖారావానికి సిద్ధమైంది. 28న చంద్రబాబు, పవన్కలిసి తాడేపల్లిగూడెంలో ఉమ్మడి బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. ఇంతకీ పొత్తు గురించి బీజేపీ పెద్దలు ఎందుకు నానుస్తున్నారు..? కావాల్సిన చోట అడిగినన్ని సీట్లకు బాబు అంగీకరించలేదనా.. లేక వ్యూహాత్మకంగా జాప్యం చేస్తున్నారా అనేది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
దిశ, ఏపీ బ్యూరో: చంద్రబాబు అరెస్టుకు తెర ముందు వైసీపీసర్కారు ఉంటే.. తెర వెనక ఢిల్లీ పెద్దల హస్తం ఉందని టీడీపీ శ్రేణులు దుమ్మెత్తిపోశాయి. గాంధర్వ వివాహంలాగా పవన్‌ను ముందుకు నెట్టి బీజేపీ పొత్తుకు సిద్దమైందని తమ్ముళ్లు తెగ మథనపడుతున్నారు. అయినా సరే రాష్ట్రంలో జగన్ప్రభుత్వానికి కేంద్ర పెద్దల సహకారం దక్కకుండా చేయాలనే ఉద్దేశంతో చంద్రబాబు పొత్తుకు సిద్దమయ్యారు. బీజేపీ అగ్రనేతలు తల్చుకుంటే జగన్రాష్ట్రంలో ఒక్కరోజు పాలన చేయలేరని చంద్రబాబు బలంగా విశ్వసించారు. అయినా వైసీపీ సర్కారుపై కేంద్రం కన్నెర్రజేసింది లేదు. ఇప్పటిదాకా ఢిల్లీ బాద్‌షాల నుంచి పొత్తు ప్రకటన వెలువడలేదు. హఠాత్తుగా ఏలూరులో బీజేపీ నేతలు ఎన్నికల శంఖారావానికి సిద్దమయ్యారు. అంతకన్నా ముందే టీడీపీ–జనసేన తాడేపల్లిగూడెంలో ఉమ్మడి సభ నిర్వహించాలని నిర్ణయించారు.
ఆ సీట్లు ఇవ్వలేమన్న బాబు..?
మూడు పార్టీల మధ్య దోబూచులాడుతున్న పరిణామాలు చూస్తుంటే పొత్తు విషయాన్ని కమలనాథులు కావాలనే నాన్చుతున్నట్లు అవగతమవుతోంది. తొలుత వాళ్లు ఎక్కడెక్కడ ఎన్ని సీట్లు కావాలని అడిగారో.. ఆ ప్రతిపాదనకే కట్టుబడి ఉన్నట్లు సమాచారం. టీడీపీకి కంచుకోటల్లాంటి సీట్లను బీజేపీ అడగడంతో చంద్రబాబు సాధ్యం కాదని చెప్పినట్లు తెలుస్తోంది. అసలు జీరో స్థానంలో ఉన్న జనసేన, బీజేపీకి 30 సీట్లు కేటాయించాలని టీడీపీ భావించింది. అందుకు తగ్గట్లు ఎంపీ స్థానాలు కేటాయించాలనుకున్నారు. అంతకుమించి ఎక్కువ సీట్లలో ఆ రెండు పార్టీలు పోటీ చేసి గెలవకపోయినా టీడీపీకి అధికారం దక్కడం కష్టం. ఈ లెక్కలన్నీ అంచనా వేసిన తర్వాతనే చంద్రబాబు ఇచ్చే సీట్ల ప్రతిపాదన చేశారు. దీనికి తలొగ్గనందునే బీజేపీ పెద్దలు పొత్తును నానుస్తున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు.
శంఖారావంలో ఎవర్ని టార్గెట్ చేస్తారు..?
పొత్తు పెండింగులో ఉండగానే బీజేపీ ఎన్నికల శంఖారావానికి సిద్దమైంది. 26న ఏలూరులో నిర్వహించే బహిరంగసభకు కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్హాజరవుతున్నారు. సభలో నేతలు ఎవర్ని టార్గెట్ చేస్తారనేది ఆసక్తిని రేకెత్తిస్తోంది. పొత్తు విషయాన్ని ప్రస్తావిస్తారా లేక స్వతంత్రంగా బరిలోకి దిగుతున్నామని ప్రకటిస్తారా అనేది కూడా ప్రజల్లో జోరుగా చర్చలు సాగుతున్నాయి. పొత్తుపై నిర్ణయం తీసుకోకుండానే బీజేపీ ఎన్నికల ప్రచారానికి దిగడంపై టీడీపీ, జనసేన నేతలు స్పందించ లేదు. ఇంతకీ కమలనాథుల వ్యూహమేంటనేది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
Read More..
వ్యూహం మార్చిన పవన్.. టికెట్ కావాలంటే ఆ పని చేయాల్సిందేనని తేల్చిచెప్పిన జనసేనాని..!