Focus on Power : పవన్‌పైనే బీజేపీ ఆశలు.. మరి జనసేనాని నిర్ణయమేంటో..?

కర్ణాటక ఎన్నికలను బీజేపీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది..

Update: 2023-04-21 17:12 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: కర్ణాటక ఎన్నికలను బీజేపీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కర్ణాటక రాష్ట్ర ఎన్నికల్లో గెలుపుకోసం అస్త్రసస్త్రాలను ప్రయోగిస్తుంది. ఒకవైపు సర్వేలన్నీ కాంగ్రెస్‌కు అనుకూలంగా వస్తున్నప్పటికీ బీజేపీ మాత్రం ఎలాగైనా గెలుపొందాల్సిందేనని ధీమాగా ఉంది. అందుకు అవసరమైన అన్ని వనరులను సమకూర్చుకునే పనిలో పడింది. అంతేకాదు స్టార్ కాంపైనర్లను సైతం ప్రకటించింది. ఇకపోతే కర్ణాటకలో స్థిరపడిన తెలుగుఓటర్లు బీజేపీవైపు తిరిగితే గెలుపు నల్లేరుపై నడకేనని అధిష్టానం భావిస్తుంది. ఈ పరిణామాల నేపథ్యంలో మిత్రపక్షం జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌ను పర్యటించేలా వ్యూహరచన చేస్తోంది. కర్ణాటకలో పవన్ కల్యాణ్‌కు విపరీతమైన ప్రజాదరణ ఉంది. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారంలోకి దించితే మెరుగైన ఫలితాలు వస్తాయని ఆశిస్తుంది. అయితే పవన్ కల్యాణ్‌ను ఇప్పటికే బీజేపీ నేతలు సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. అయితే పవన్ కల్యాణ్ ప్రచారం చేసేందుకు ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. మరోవైపు తన ఢిల్లీ పర్యటనలో బీజేపీ నాయకత్వం సానుకూలంగా స్పందించలేదని పవన్ కల్యాణ్ బెట్టు చేస్తున్నారనే ప్రచారం కూడా ఉంది. మొత్తానికి కర్ణాటక ఎన్నికల ప్రచారానికి పవన్ వెళ్తారా వెళ్లరా అనే దానిపై ఉత్కంఠ నెలకొంది.

కర్ణాటక ఎన్నికలు అత్యంత ప్రతిష్టాత్మకం

కర్ణాటక ఎన్నికల ప్రచారంలో మిత్రపక్షం అయిన జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సేవలను వినియోగించుకోవాలని బీజేపీ జాతీయ నాయకత్వం భావిస్తుంది. ఇందుకోసం నెలకు పైగా ముందు నుంచే ప్రతిపాదన పెట్టినట్లు తెలుస్తోంది. ఇటీవలే పవన్ కల్యాణ్ ఢిల్లీలో పర్యటించారు. రెండు రోజులపాటు బీజేపీ అగ్రనాయకత్వంతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఆ సందర్భంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పార్టీ ఫోకస్ అంతా కర్ణాటక ఎన్నికలపై పెట్టిందని వెల్లడించారు. కర్ణాటక ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నామని అనంతరం ఏపీ రాజకీయాలపై దృష్టి సారిస్తామని హామీ ఇచ్చారు. అదే సందర్భంలో కర్ణాటక రాష్ట్రంలో జరగబోయే ఎన్నికల ప్రచారానికి రావాలని కూడా ఆహ్వానించినట్లు ప్రచారం జరిగింది. అయితే నాడు ఆలోచించి చెప్తానని పవన్ స్పష్టం చేసినట్లు కథనాలు వెలువడిన సంగతి తెలిసిందే.

తేజస్వీ సూర్య భేటీ

కర్ణాటక రాష్ట్రంలో తెలుగు ప్రజలు విపరీతంగా ఉన్నారనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అంతకుమించి జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌కు విపరీతమైన క్రేజ్ సైతం ఉంది. ఈ నేపథ్యంలో తెలుగువారు అధికంగా ఉన్న ప్రాంతాల్లో బీజేపీ తరుఫున పవన్ ప్రచారం చేస్తారని బీజేపీ భావించింది. ఈ నేపథ్యంలో బీజేపీ యువమోర్చా జాతీయ అధ్యక్షుడు తేజస్వీ సూర్య జనసేనాని పవన్ కల్యాణ్‌తో వరుస భేటీలు అయినట్లు తెలుస్తోంది. ఇప్పటికే రెండుసార్లు తేజస్వీ సూర్య భేటీ అయ్యారని ..కర్ణాటక ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలని ఆహ్వానించినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలోని తెలుగు ప్రజలు ఎక్కువగా ఉన్న బాగేపల్లి, చిక్ బళ్లాపూర్, బెంగుళూరు సిటీ, కోలార్‌లలో ఎన్నికల ప్రచారానికి రావాలని ఆహ్వానించారు. మే 8 నాటికి ఎన్నికల ప్రచారం ముగుస్తుందని తేజస్వీ సూర్యగుర్తు చేశారు. అయితే జనసేనాని మాత్రం వరుస సినిమాలతో బిజీబిజీగా ఉన్న నేపథ్యంలో షెడ్యూల్‌ను బట్టి ప్రచారంపై ఓ నిర్ణయానికి వస్తానని చెప్పి అనంతరం మౌనం వహిస్తున్నారని తెలుస్తోంది.

బెట్టు చేస్తున్న పవన్ కల్యాణ్?

కర్ణాటక ఎన్నికల ప్రచారంలో పవన్ కల్యాణ్ పాల్గొంటారా అనేదానిపై అనేక సందేహాలు ఉన్నాయి. కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వంపై చాలా అవినీతి ఆరోపణలతోపాటు ప్రభుత్వ వ్యతిరేకత సైతం తీవ్రంగా ఉంది. మరోవైపు సర్వే ఫలితాలన్నీ కాంగ్రెస్‌కు అనుకూలంగా వస్తున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో బీజేపీ తరఫున ప్రచారం చేయడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదని పవన్ భావిస్తున్నారనే ప్రచారం జరుగుతుంది. పవన్ కల్యాణ్ పర్యటించినా కూడా బీజేపీ ఓటమి పాలైతే ఐరన్ లెగ్‌గా ముద్రవేస్తారని లేనిపోనిది ఎందుకు కొనితెచ్చుకోవడం అనే ఆలోచనలో జనసేనాని ఉన్నట్లు తెలుస్తోంది.

మరోవైపు జనసేనాని పవన్ కల్యాణ్ ఢిల్లీ పర్యటనలో బీజేపీ అగ్రనాయకత్వం వద్ద 2014 ఎన్నికల ఫార్ములాను ఉంచారని అయితే అందుకు బీజేపీ నాయకత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని తెలుస్తోంది. తన ప్రతిపాదనలను బీజేపీ నాయకత్వం పక్కనపెట్టడంతోనే పవన్ ఎన్నికల ప్రచారానికి వెళ్లకుండా బెట్టు చేస్తున్నారనే ప్రచారం జరుగుతుంది. వైసీపీ విముక్త ఏపీ లక్ష్యమని.. నిబంధనలకు విరుద్ధంగా వైసీపీకి సహకరించడం ఆపేయాలని పవన్ విజ్ఞప్తి చేశారని.. అయినప్పటికీ బీజేపీ అగ్రనాయకత్వం పట్టించుకోలేదని తెలుస్తోంది. వైసీపీకి బీజేపీ దగ్గరగా ఉంటున్న నేపథ్యంలో తాను ప్రచారానికి ఎందుకు వెళ్లాలనే యోచనలో పవన్ కల్యాణ్ ఉన్నారనే ప్రచారం కూడా జరుగుతుంది. ఏది ఏమైనప్పటికీ పవన్ కల్యాణ్ కర్ణాటక ఎన్నికల ప్రచారం పై ప్రతిష్టంభన నెలకొంది. ఎన్నికలప్రచారానికి పవన్ కల్యాణ్ వెళ్తే బీజేపీతో పొత్తు కొనసాగుతుందని లేని పక్షంలో ఇక కటీఫ్ అయ్యే అవకాశం లేకపోలేదని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది.

Tags:    

Similar News