Breaking: సీఎం రమేశ్ అరెస్ట్..?.. బీజేపీ చీఫ్ ఆగ్రహం

బీజేపీ అనకాపల్లి ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్‌ను పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది...

Update: 2024-05-04 16:08 GMT

దిశ, వెబ్ డెస్క్: బీజేపీ అనకాపల్లి ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్‌ను పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. అనకాపల్లి మండలం మాడుగుల మండలం తారువలో ఎన్నికల ప్రచారానికి వెళ్లిన బీజేపీ నేతలు, వైసీపీ కార్యకర్తలకు మధ్య వాగ్వాదం జరిగింది. డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు స్వగ్రామం కావడంతో రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. దీంతో బీజేపీ నేతలు, కార్యకర్తలపై వైసీపీ నాయకులు దాడి చేశారు. ఈ దాడిలో గాయపడిన బీజేపీ కార్యకర్తలను పరామర్శించేందుకు వెళ్లిన సీఎం రమేశ్ కారుపైనా దాడి చేసినట్లు సమాచారం. సీఎం రమేశ్ కారు అద్ధాలు కూడా ధ్వంసమయ్యాయని తెలిసింది. ఈ ఘటనతో పోలీసులు సీఎం రమేశ్‌ను అరెస్ట్ చేసి తరలిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో సీఎం రమేశ్‌పై కొందరు దుండగులు దాడికి యత్నించినట్లు తెలుస్తోంది. దీంతో బీజేపీ నేతలు, కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారానికి వెళ్తే దాడులకు తెగబడతారా అని మండిపడుతున్నారు.

ఈ ఘటనపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి స్పందించారు. వైసీపీ నాయకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం రమేశ్ అక్రమమని మండిపడ్డారు. సీఎం రమేశ్‌ను బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల కోడ్‌కు విరుద్ధంగా పోలీసుల తీరుందని పురంధేశ్వరి ధ్వజమెత్తారు. ఎన్నికల సమయంలో ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందన్నారు. ప్రతిపక్షాల ప్రచారాలను అడ్డుకోవడానికి పోలీసులతో ప్రభుత్వం ఇలాంటి పనులు చేయిస్తోందని పురంధేశ్వరి ఆగ్రహం వ్యక్తం చేశారు.

Tags:    

Similar News