ఐఏఎస్ అధికారి ప్రవీణ్ ప్రకాశ్‌కు బిగ్ షాక్: జనవరి 2న ఢిల్లీకి రావాలని ఆదేశాలు
ఏపీ విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్‌కు జాతీయ ఎస్టీ కమిషన్ నోటీసులు జారీ చేసింది.
దిశ, డైనమిక్ బ్యూరో : ఏపీ విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్‌కు జాతీయ ఎస్టీ కమిషన్ నోటీసులు జారీ చేసింది. జనవరి 2న ఢిల్లీలోని జాతీయ ఎస్టీ కమిషన్ ఎదుట హాజరుకావాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ఇకపోతే శ్రీకాకుళం జిల్లాలో ఐఈఆర్‌పీ (ఇన్‌క్లూజివ్ ఎడ్యుకేషన్ రిసోర్స్ పర్సన్) కాంట్రాక్ట్ పోస్టుల నియామకాల్లో భారీగా అక్రమాలు జరిగాయంటూ జాతీయ ఎస్టీ కమిషన్‌కు ఫిర్యాదు అందింంది. తన పేరు ఓపెన్ కేటగిరీలో తొలి స్థానంలో ఉన్నప్పటికీ తనకు ఉద్యోగం ఇవ్వలేదంటూ సారవకోట మండలం గోవర్ధనపురం పంచాయతీ అర్లి గ్రామానికి చెందిన పాలకొండ నిర్మల అనే అభ్యర్థి ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదుపై జాతీయ ఎస్టీ కమిషన్ స్పందించింది. ఏపీ విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్‌కు నోటీసులు ఇచ్చింది.
గతంలోనే నోటీసులు
వాస్తవానికి గత నెల 17నే ప్రవీణ్ ప్రకాశ్‌కు నోటీసులు అందాయి. ఈ ఆరోపణలపై సహేతుకమైన వివరణ ఇవ్వాలని నోటీసుల్లో జాతీయ ఎస్టీ కమిషన్ కోరింది. అయితే ఆ నోటీసులపై ప్రవీణ్ ప్రకాశ్ స్పందించకపోవడంతో జాతీయ ఎస్టీ కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు మరోసారి నోటీసులు ఇచ్చింది. పూర్తి వివరాలతో జనవరి 2న ఢిల్లీలోని జాతీయ ఎస్టీ కమిషన్ కార్యాలయానికి రావాలని ప్రవీణ్ ప్రకాశ్‌ను ఆదేశించింది. మరోవైపు ఆరోపణలకు సంబంధించి ఆధారాలతో సహా విచారణకు హాజరుకావాలని అభ్యర్థి పాలకొండ నిర్మలను సైతం ఆదేశించింది.ఈ మేరకు నిర్మల మీడియాతో మాట్లాడారు. ఓపెన్ కేటగిరిలో తన పేరు మొదటి స్థానంలో ఉన్నా తనకు ఉద్యోగం ఇవ్వకుండా అన్యాయం చేశారని ఆరోపించారు. ఈ మేరకు తనకు న్యాయం జరగాలనే ఉద్దేశంతో జాతీయ ఎస్టీ కమిషన్‌ను ఆశ్రయించినట్టు పాలకొండ నిర్మల వెల్లడించారు.