ఆ కుర్చీపై ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి కన్ను: వైఎస్ జగన్ కరుణించేనా?

టీటీడీ పదవీకాలం ముగియడంతో కొత్త చైర్మన్ పదవికి రేస్ మెుదలైందా? కొత్త చైర్మన్‌గా ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి అనేది కేవలం ప్రచారం మాత్రమేనా?

Update: 2023-07-28 06:37 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : టీటీడీ పదవీకాలం ముగియడంతో కొత్త చైర్మన్ పదవికి రేస్ మెుదలైందా? కొత్త చైర్మన్‌గా ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి అనేది కేవలం ప్రచారం మాత్రమేనా? ఇంకా నూతన చైర్మన్‌ ఎవరు అనేది సీఎం జగన్ డిసైడ్ చేయలేదా? తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి సైతం ఈ పదవిని ఆశిస్తున్నారా? గతంలో వైఎస్ఆర్ హయాంలో టీటీడీ చైర్మన్‌గా పనిచేసిన అనుభవంతో మరోసారి చేసేందుకు ఉత్సాహం చూపిస్తున్నారా? తన మనసులో మాటను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చెవిలో వేశారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. టీటీడీ చైర్మన్ పదవిని భూమన కరుణాకర్ రెడ్డి ఆశిస్తున్నారనే ప్రచారం రాజకీయవర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతుంది. ఇందులో భాగంగానే ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను కలిసి తన మనసులో మాటను బయటపెట్టారని తెలుస్తోంది. అయితే ఈ పదవిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఇప్పటికే జంగా కృష్ణమూర్తిని టీటీడీ కొత్త చైర్మన్‌గా నియమించడం దాదాపు ఖరారైపోయింది అని వార్తలు వస్తున్న నేపథ్యంలో భూమన కరుణాకర్ రెడ్డి వైఎస్ జగన్‌తో భేటీ కావడం కొత్త చర్చకు తెరలేపిందనే చెప్పాలి.

భూమన మనసులో మాట

ఎన్నికళ వేల పార్టీ అధినేతను ఎవరు కలిసినా కొత్త చర్చ జరుగాల్సిందే. ఇక ఏవేవో కథనాలు,కథలు వండీ వడ్డించడమే తరువాయి. ఇకపోతే ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి మర్యాదూర్వకంగా కలిశారు. అంతే భూమన కరుణాకర్ రెడ్డి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తో భేటీ కావడంపై అనేక ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి. అందులోనూ తిరుపతి ఎమ్మెల్యే కావడం...ఆగష్టు 12తో టీటీడీ చైర్మన్, పాలకమండలి పదవీకాలం ముగియడం ఇలాంటి తరుణంలో వైఎస్ జగన్‌తో భేటీ కావడంతో ఇంకేముంది టీటీడీ చైర్మన్ పదవి కోసం కలిశారని ప్రచారం జరుగుతుంది. ఈసారి టీటీడీ చైర్మన్ పదవి తనకు ఇవ్వాలని కోరినట్లు తెలుస్తోంది. ఇప్పటికే భూమన కరుణాకర్ రెడ్డి టీటీడీ పాలకమండలి సభ్యులుగా పని చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తనకు ఒక్క ఛాన్స్ ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను కోరినట్లు తెలుస్తోంది. భూమన కరుణాకర్ రెడ్డి గతంలోనూ టీటీడీ చైర్మన్‌గా పనిచేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో టీటీడీ చైర్మన్‌గా పనిచేసి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ అనుభవంతో తనకు మరో అవకాశం ఇస్తే స్వామివారి సేవలో తరిస్తానని సీఎం జగన్‌ వద్ద మెరపెట్టుకున్నట్లు తెలుస్తోంది.

కొడుక్కి టికెట్‌ దక్కేనా?

ఇకపోతే భూమన కరుణాకర్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. మంత్రి వర్గం కూర్పుపై కసరత్తు జరుగుతుంది. అయితే జగన్ కేబినెట్‌లో బెర్త్ ఆశించిన భూమన కరుణాకర్ రెడ్డి ఓ ప్రెస్‌మీట్ పెట్టారు. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయనని ప్రకటించారు. తన కుమారుడు పోటీ చేస్తారని ప్రకటించేశారు. ఈ ఐదేళ్ల తనకు ఎమ్మెల్యేగా పనిచేసే అవకాశం అని చెప్పుకొచ్చారు. వచ్చే ఎన్నికల్లో టికెట్ అడగనని చెప్పినప్పటికీ సీఎం జగన్ తన కేబినెట్‌లోకి తీసుకోలేదు. కేబినెట్ విస్తరణ సమయంలోనైనా దక్కుతుందని భావించినా అయినా మెుండి చేయే చూపించారు. అప్పటి నుంచి భూమన కరుణాకర్ రెడ్డి కేవలం నియోజకవర్గానికే పరిమితమయ్యారు. వైఎస్ జగన్ భూమనకు పలు కీలకమైన పదవులు కట్టబెడుతూనే ఉన్నారు. ఇటీవలే సభాహక్కుల కమిటీ చైర్మన్ పదవిని సైతం కట్టబెట్టారు. అయితే తాజాగా టీటీడీ చైర్మన్ పదవిని కోరినట్లు తెలుస్తోంది. మరి సీఎం జగన్ భూమన కరుణాకర్ రెడ్డికి అవకాశం ఇస్తారా లేదా అనేది వేచి చూడాలి. ఇదే సమయంలో వచ్చే ఎన్నికల్లో తిరుపతి ఎమ్మెల్యే పదవికి పోటీ చేయనని..తన కుమారుడికి తిరుపతి ఎమ్మెల్యే టికెట్‌ ఇవ్వాలని కోరినట్లు తెలుస్తోంది. పనిలో పనిగా నియోజకవర్గంలోని పలు సమస్యలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు భూమన కరుణాకర్ రెడ్డి ఏకరువు పెట్టినట్లు తెలుస్తోంది. మరి భూమన కరుణాకర్ రెడ్డి కోరినట్లు సీఎం జగన్ టీటీడీ చైర్మన్ పదవి కట్టబెడతారా? వచ్చే ఎన్నికల్లో భూమన కరుణాకర్ రెడ్డికి సీఎం జగన్ టికెట్ ఇస్తారా? ఇవన్నీ తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

Read More:   Amaravati: వరద పరిస్థితులపై అధికారులకు సీఎం జగన్ కీలక ఆదేశాలు 

Tags:    

Similar News