టీచర్లపై కక్షసాధింపు జగన్ రెడ్డి అరాచకానికి పరాకాష్ట :అనగాని సత్య ప్రసాద్
ఎన్నికల్లో జగన్ రెడ్డి టీచర్లకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోగా వారిపై కక్షసాధింపు చర్యలకు పాల్పడటం దుర్మార్గం అని టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ అన్నారు.
దిశ, డైనమిక్ బ్యూరో : ఎన్నికల్లో జగన్ రెడ్డి టీచర్లకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోగా వారిపై కక్షసాధింపు చర్యలకు పాల్పడటం దుర్మార్గం అని టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ అన్నారు. టీచర్లను మద్యం షాపుల ముందు కాపలా ఉంచి, మద్యం అమ్మించారు అని ఆరోపించారు. టీచర్లచే బాత్ రూమ్‌లు కడిగించారు అని మండిపడ్డారు. బదిలీల విషయంలో న్యాయం చేయమని అడినందుకు ఉపాధ్యాయులపై లాఠీ ఝులిపించారు అని గుర్తు చేశారు. పీఆర్సీపై ఆందోళన చేస్తుంటే పోలీసులతో కొట్టించారు అని గుర్తు చేశారు. సీపీఎస్ రద్దు హామీని అమలు చేయమంటే భౌతికంగా దాడులు చేశారని మండిపడ్డారు. 3ఏళ్లుగా అమలు చేయని బయోమెట్రిక్ విధానాన్ని ఉపాధ్యాయులపై కక్షపూరితంగా అమలు చేస్తున్నారు అని ధ్వజమెత్తారు. కరోనా సమయంలో దాదాపు 1500 మంది ఉపాధ్యాయులకు చనిపోతే వాళ్లు కుటుంబాన్ని ఆదుకోలేదని విరుచుకుపడ్డారు. టీచర్లకు అదనంగా ముఖహాజరు, అనంతరం విద్యార్థుల హాజరు, బాత్‌రూమ్‌ల ఫొటోలు, మధ్యాహ్న భోజనం ఫొటోలు, నాడునేడు ఫొటోలు, గుడ్లు, చిక్కీల ఫొటోలు అంటూ టీచర్లపై పరిమితికి మించి యాప్‌ల భారం మోపారని మండిపడ్డారు. సీపీఎస్ ఉద్యమం చేశారని అనేక మంది పై బైడోవర్ కేసులు, వంటివి పెట్టారు అని ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ ఆరోపించారు. టీచర్లు, ఉద్యోగస్థులు సీపీఎస్ మీద ఉద్యమం చేశారని బయోమెట్రిక్ విధానం తీసేసి ఫేస్ రికగ్నేషన్ అటెండన్స్ పెట్టారు అని ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ ఆరోపించారు. ఫేస్ రికగ్నేషన్ కి నెట్ వర్క్ కావాలి. అందుకు మీ ఫోన్లనే డేటాని వాడి అప్ లోడ్ చేయాలనడం దుర్మార్గమన్నారు. ఆశా వర్కర్లకి, అంగన్ వాడీ వాళ్లకు తక్కువ జీతం కాబట్టి టాబ్ లను ఇచ్చామంటున్నారు. మీకు ఎక్కువ జీతం కాబట్టి మీ ఫోన్ లలోనే అటెండెన్స్ ను ఇవ్వండని ప్రభుత్వం వింత వాదనను తీసుకురావడం సిగ్గుచేటు అని మండిపడ్డారు. బైజూస్ ట్యాబ్‌లలో విద్యార్ధులు ఏం నేర్చుకుంటున్నారో అప్ లోడ్ చేయలేదని ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు ఇస్తున్నారు అని ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
దొడ్డిదారిన బదిలీలు
ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికారపక్షానికి వ్యతిరేకంగా ప్రచారంలో పాల్గొన్న ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు ఇవ్వడం సిగ్గుచేటు అని ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ ఖండించారు. ఒకరోజు ప్రవీణ్ ప్రకాశ్ ఉపాధ్యాయుల విధులు నిర్వహిస్తే వారి బాధలేంటో ఆయనకు తెలుస్తాయన్నారు. పాఠ్యపుస్తకాల పంపిణీ, నాడు నేడులో పనుల్లో ప్రభుత్వ లోపాలను టీచర్లపై నెట్టి ఏదో ఒక సాకును బూచిగా చూపించి సస్పెన్షన్లు చేస్తున్నారు అని మండిపడ్డారు. గతంలో పార్వతీపురం మన్యం జిల్లాలో ప్రవీణ్ ప్రకాష్ పర్యవేక్షిస్తూ కుంటి సాకులతో డీఈవో, నలుగురు పర్యవేక్షణాధికారులను సస్పెండ్ చేశారని మండిపడ్డారు. దొడ్డిదారి బదిలీలు, జీవో 117, అధిక పని ఒత్తిడితో టీచర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉపాధ్యాయులపై పెట్టిన అక్రమ కేసులు వెంటనే ఎత్తి వేయాలి. ప్రభుత్వం వెంటనే ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి.ఉపాధ్యాయుల్ని ఉక్కుపాదం తో అణిచి వేస్తున్న ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించక తప్పదు అని ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ హెచ్చరించారు.