పవన్ సీఎం రేసులో లేనట్లే.. అభిమానులకు స్ట్రాంగ్ కౌంటర్
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన అన్ రియలిస్టిక్ అభిమానులకి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు
దిశ, డైనమిక్ బ్యూరో: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన అన్ రియలిస్టిక్ అభిమానులకి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. కొందరు అభిమానులు, కార్యకర్తలు తనని ముఖ్యమంత్రి స్థానం అడుగు అడుగు అని ఒత్తిడి తెచ్చే పని పెట్టుకున్నారని, గత ఎన్నికల్లో తాను 153 స్థానాల్లో పోటీ చేశానని, అందులో 30 నుంచి 40 సీట్ల మధ్యలో తనని గెలిపించి ఉన్నట్లయితే.. సీఎం సీటు అడగడానికి తనకు సంపూర్ణ హక్కు ఉండేదని అన్నారు. 30 సీట్లు పక్కన పెడితే, కనీసం నన్ను గెలిపించుకొని ఉన్నా బాగుండేదని అన్నారు. అలా కొన్ని సీట్లలో గెలిపించి.. అప్పుడు నీ కోసం మేము నిలబడ్డాం, ఇప్పడు ముఖ్యమంత్రి స్థానం తేల్చాకే ముందుకు వెళ్లండని అంటే తాను వినేవాడినని అన్నారు. ఒక్క సీటు లేకుండా ముఖ్యమంత్రి స్థానం అడగడానికి ఏం హక్కు ఉంటుందని అన్నారు.
ఈ పరంగా చూసుకుంటే సీఎం రేసు నుంచి పవన్ తప్పుకున్నట్లేనని తెలుస్తుంది. పొత్తుల నిబందనల్లో సీఎం సీటు టీడీపీకే వెళ్లిందని స్పష్టంగా అర్ధం అవుతుంది. ఏపీలో టీడీపీ, జనసేన పొత్తు నెగ్గితే సీఎంగా టీడీపీ వ్యక్తికి అవకాశం ఉండొచ్చు. మరి పవన్ కి డిప్యూటి అయినా దక్కుతుందా..? లేక ఏదో ఒక మంత్రి పదవితో సరిపెట్టుకుంటారా..? అనేది ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. కాగా ఇవ్వాళ గణతంత్ర దినోత్సవం సందర్భంగా పవన్ రాజోలు, రాజనగరం నియోజకవర్గాల్లో అభ్యర్ధులను ప్రకటించారు. చంద్రబాబు తనకు ఉన్న ఒత్తిడి వల్ల ఆయన రెండు సీట్లు ప్రకటించారని, నాకున్న ఒత్తిడి వల్ల నేను కూడా రెండు సీట్లు ప్రకటిస్తున్నాని అన్నారు. మరి ఈ సీట్ల ప్రకటన పొత్తులో భాగంగా చంద్రబాబుతో చర్చించే ప్రకటించారా..? లేదా సొంత నిర్ణయం తీసుకున్నారా.. అనేది ప్రశ్నార్ధకంగా మారింది.