ఏపీ అప్పు రూ.10 లక్షల కోట్లు.. కేంద్రాన్ని మోసం చేస్తున్న జగన్

2014-19 మధ్య తెలుగుదేశం హయాంలో చేసిన అప్పుల కన్నా వైసీపీ ప్రభుత్వం రెండున్నర రెట్లు ఎక్కువ అప్పులు చేసింది టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు ఆరోపించారు.

Update: 2023-08-23 05:14 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : 2014-19 మధ్య తెలుగుదేశం హయాంలో చేసిన అప్పుల కన్నా వైసీపీ ప్రభుత్వం రెండున్నర రెట్లు ఎక్కువ అప్పులు చేసింది టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు ఆరోపించారు. ఈ అప్పులపై తప్పుడు సమాచారం ఇస్తుందని ప్రభుత్వంపై యనమల మండిపడ్డారు. గత ప్రభుత్వం కంటే తక్కువ అప్పులు చేశామని..నిబంధనలు పాటించామంటున్న ప్రభుత్వ వివరణపై ప్రశ్నలు సంధించారు. అప్పుల విషయంలో వాస్తవాలు తెలియజేయాలంటూ రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ ఎస్ రావత్‌కు మాజీ ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు బుధవారం లేఖ రాశారు. రాష్ట్ర ప్రభుత్వ ఫైనాన్సియల్ ఇన్డిసిప్లెయిన్ (ఆర్థిక క్రమశిక్షణా రాహిత్యం) పై కాగ్ నివేదిక అంశాలను లేఖలో ప్రస్తావించారు. కేంద్ర ప్రభుత్వాన్ని మోసం చేస్తూ..కాగ్ కు తప్పుడు సమాచారం ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం జరిపిన లావాదేవీలను లేఖలో యనమల ప్రస్తావించారు. కాగ్ 2022 ఆడిట్ నివేదికలో ప్రస్తావించిన అంశాల ఆధారంగా ప్రభుత్వం చేసిన అప్పులు, తప్పులపై సర్కారు వాస్తవాలు చెప్పాలంటూ లేఖలో కోరారు. అప్పులు రూ. 10 లక్షల కోట్లకు చేరిన వైనాన్ని వివరిస్తూ యనమల లేఖ రాశారు. ఈ వివరాలపై ప్రభుత్వ పరంగా పూర్తి సమాధానం చెప్పాలని లేఖలో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు డిమాండ్ చేశారు.

ట్రెజరీతో సంబంధం లేకుండా కోట్ల మేరకు బిల్లుల చెల్లింపులు

తెలుగుదేశం ప్రభుత్వం 2014-19 పాలనలో రూ.1.39 లక్షల కోట్ల అప్పులు మాత్రమే చేసింది. అది కూడా ఏఆర్‌బీఎం పరిమితికి లోబడి మాత్రమే నాడు టీడీపీ ప్రభుత్వం అప్పులు చేసింది అని యనమల రామకృష్ణుడు గుర్తు చేశారు. అయితే వైసీసీ ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వంలోని అప్పుల కంటే రెండున్నర రెట్లు ఎక్కువ అప్పులు చేసిందని చెప్పుకొచ్చారు. 1 లక్ష కోట్లు అసెంబ్లీ అనుమతి లేకుండా అప్పులు చేసినట్లు కాగ్ తన నివేదికలో గణాంకాలతో సహా నిర్ధారించింది అని గుర్తు చేశారు. ప్రభుత్వ గ్యారంటీల ద్వారా తీసుకున్న అప్పులు 2022 మార్చి నాటికే 1,18,003 కోట్లు అని కాగ్ తేల్చింది అని చెప్పుకొచ్చారు. ఇవి కాక రూ.18 వేల కోట్ల మేరకు విద్యుత్ సంస్థల బకాయిలు, లెక్కలు చూపని సాగునీటి, తాగునీరు రంగాల పెండింగ్ బిల్లులు, పంచాయితీ సంస్థల నుండి తీసుకున్న రూ.20 వేల కోట్లు, ఉద్యోగులకు పెండింగ్ పెట్టిన బకాయిలు కలిపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అప్పు రూ.10 లక్షల కోట్లను దాటింది అని యనమల రామకృష్ణుడు చెప్పుకొచ్చారు. మితిమీరిన అప్పుల కారణంగా 2024 సంవత్సరంలో రూ.42 వేల కోట్లు అప్పులుగా చెల్లించాల్సిన పరిస్థితి వచ్చింది అని చెప్పుకొచ్చారు. ఇంత అప్పు చేసినా మూలధన వ్యయం దేశంలో సగటున 14 శాతం ఉంటే రాష్ట్రంలో మాత్రం 9 శాతం మాత్రమే ఉందన్నారు. ట్రెజరీతో సంబంధం లేకుండా కోట్ల మేరకు బిల్లుల చెల్లింపులు జరుగుతున్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తప్పుడు గణాంకాల ఆధారంగా కేంద్రం నుండి ఎక్కువ అప్పులకు అనుమతి పొందింది అని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు చెప్పుకొచ్చారు.

Tags:    

Similar News