ఏపీని అత్యాచార రాష్ట్రం గా మార్చేశారు: టీడీపీ

Update: 2022-01-29 12:39 GMT

దిశ, ఏపీ బ్యూరో : రాష్ట్రంలో రాత్రే కాదు పగలు సైతం అమ్మాయిలు రోడ్లపై తిరిగే పరిస్థితి లేదని మాజీ మంత్రి పీతల సుజాత, మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనితలు విమర్శించారు. గుంటూరు జిల్లాలో మైనర్ బాలికపై అత్యాచార ఘటనపై నేతలు మీడియాతో మాట్లాడారు. వైఎస్ జగన్ పాలనలో మహిళల మాన ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందని విమర్శించారు. మైనర్ బాలికలను సైతం వదలకుండా వాళ్ల మీద దాడులు చేయడం దుర్మార్గమని తెలుగు రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత అన్నారు. దీని మొత్తానికి కారణం జగన్ అతని అనుచరులు కారణమని ఆరోపించారు. ముఖ్యమంత్రిగా తమ అధినేత జగన్ ఉన్నారనే భరోసాతో కామాంధులు చిన్న పిల్లలపై లైంగిక దాడులకు పాల్పడుతున్నారన్నారు. తల్లి చనిపోయిన 14 ఏళ్ల ఆడబిడ్డను అత్యంత కిరాతకంగా వ్యభిచారం గృహానికి అమ్మేశారని ఇంతకంటే దుర్మార్గం ఏముందన్నారు.

2 నెలలుగా 14 ఏళ్ల బాలికపై అత్యంత కిరాతకంగా అత్యాచారం చేయడం బాధాకరమన్నారు. ఈ దారుణానికి ఒడిగట్టిన నిందితుడు భూ శంకర్ ఎంపీ మోపిదేవి వెంకటరమణకు ప్రధాన అనుచరుడని చెప్పుకొచ్చారు. భూ శంకర్‌ని అరెస్ట్ చేసినట్లు చూపిస్తే ఆ బాలికకు న్యాయం జరిగినట్లా అని ప్రశ్నించారు. నరసరావుపేటలో ఆడపిల్ల పై జరిగిన దాడులకు ఇప్పటికీ శిక్ష పడలేదన్నారు. సెంట్రల్ క్రైమ్ రిపోర్ట్ ప్రకారం అపహరణకు గురైన ఆడపిల్లల స్థానంలో రాష్ట్రం రెండో స్థానంలో ఉందని వంగలపూడి అనిత విమర్శించారు. ఆడపిల్లలను ఇంట్లోకి వెళ్లి పీకలు కోసి హత్య చేస్తున్నారని ఇలాంటి ఘటనకు సమాధానం చెప్పవలసిన అవసరం సీఎం వైఎస్ జగన్‌పై ఉందన్నారు. దిశ చట్టం ఏర్పాటు చేసిన రోజే ఒక రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి గుంటూరులో మహిళపై దాడి చేస్తే దానిని ఇప్పటి వరకు పట్టించుకున్న నాధుడే లేకపోయాడని అన్నారు. హోంమంత్రి సుచరితకు హోంశాఖ కంటే నిస్సహాయత శాఖ మంత్రిగా పేరు పెట్టుకుంటే మంచిదన్నారు.

సీతానగరం ఘటనకు సంబంధించిన నింధితులను ఇప్పటికీ పట్టుకోలేదు అని ధ్వజమెత్తారు. మహిళలకు ఏ సమస్య వచ్చినా నేను విన్నాను నేను ఉన్నాను అనే జగన్ మహిళలపై దాడుల ద్వారా రిటర్న్ గిఫ్ట్ ఇస్తున్నారని ఎద్దేవా చేశారు. మహిళల మాన, ప్రాణాలకు రేటు కడుతున్నారని ఇంతకన్నా దౌర్భాగ్యం ఏముంటుందని నిలదీశారు. వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులే కామాంధులు గా మారారని ఆరోపించారు. అంబటి రాంబాబు కామ రాంబాబు లాగా రోజుకో ఆడియో టేప్‌లతో దొరుకుతున్నా ఇప్పటికీ ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు. గుంటూరు అత్యాచారం ఘటనకు సంబంధించిన దోషులను వెంటనే శిక్షించాలని వంగలపూడి అనిత డిమాండ్ చేశారు.

మహిళల తల తీసేస్తుంటే జగన్ ఏం చేస్తున్నారు? : మాజీ మంత్రి పీతల సుజాత

రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఏపీని అత్యాచార రాష్ట్రంగా మార్చేశారని మాజీ మంత్రి పీతల సుజాత ఆరోపించారు. పాదయాత్ర సమయంలో ఆడపిల్లలకు అండగా ఉంటానని తలలు నిమిరి చెప్పిన జగన్ ఈ రోజు తలలు తీసేస్తుంటే ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత వందల సంఖ్యలో మహిళలపై దాడులు, అత్యాచారాలు జరిగాయని చెప్పుకొచ్చారు. మహిళలపై జరుగుతున్న దాడులపై తక్కువ శిక్షలు పడుతున్న రాష్ట్రంగా ఏపీ రికార్డుల్లోకి ఎక్కిందని విమర్శించారు. టీడీపీ హయాంలో దాచేపల్లిలో చిన్నారిపై ఒక నిందితుడు అత్యాచారం చేస్తే.. చంద్రబాబు ఏం చేస్తారో అనే భయంతోనే అతను ఉరి వేసుకుని చనిపోయాడని మాజీ మంత్రి పీతల సుజాత గుర్తు చేశారు.

అయితే వైసీపీ ప్రభుత్వంలో నేరస్తులకు ఎలాంటి భయం లేదని.. అందువల్లే రెచ్చిపోతున్నారని పీతల సుజాత ధ్వజమెత్తారు. గుంటూరు జిల్లా పేరేచర్ల మైనర్ బాలికపై అత్యాచారం చేసింది వైసీపీ ఎంపీ ప్రధాన అనుచరుడు కాదా అని ప్రశ్నించారు. చంద్రబాబు నేరస్తులలో ఎలా భయం పుట్టించారో అలాగే జగన్ ఎందుకు చేయలేకపోతున్నారని నిలదీశారు. పేరెచర్లలో అత్యాచారం జరిగిన అమ్మాయిని పరామర్శించడానికి టీడీపీ బృందం వెళ్తే ఆ బాలికను దాచిపెట్టారని మాజీ మంత్రి పీతల సుజాత అన్నారు.

Tags:    

Similar News