ఢిల్లీలో ఏపీ రాజకీయాలు.. ఎన్నికల వేళ ఆసక్తికర పరిణామాలు

ఏపీ రాజకీయాలు ఢిల్లీకి చేరాయి. టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు పెట్టుకుంటాయని గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. ..

Update: 2024-03-06 05:48 GMT

దిశ, వెబ్ డెస్క్: ఏపీ రాజకీయాలు ఢిల్లీకి చేరనున్నాయి. టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు పెట్టుకుంటాయని గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. టీడీపీ, జనసేన అధినేతలు చంద్రబాబు, పవన్ కల్యాణ్ హస్తినకు గురువారం బయల్దేరి వెళ్లనున్నారు. అటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి ఇప్పటికే ఢిల్లీకి వెళ్లారు. పొత్తులు, రాష్ట్రంలో బీజేపీ బలం, పార్టీ నేతలు, కార్యకర్తల అభిప్రాయానికి ఆ పార్టీ అగ్రనేతలకు పురంధేశ్వరి వివరించనున్నారు. అటు చంద్రబాబు, పవన్ సైతం బీజేపీ అగ్రనేతలను కలవనున్నారు. అనంతరం ఈ మూడు పార్టీ పొత్తులపై స్పష్టత వస్తుందని ఆయా పార్టీల శ్రేణులు చెబుతున్నారు.

అయితే బుధవారం ఉదయం చంద్రబాబు, పవన్ కల్యాణ్ సమావేశం అయ్యారు. ఉమ్మడి రెండో జాబితాపై చర్చించారు. ఇప్పటికే తొలి జాబితాను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రెండో జాబితాపై ఇప్పటికే కసరత్తు పెంచారు. టీడీపీకి చెందిన 20 నుంచి 30 అభ్యర్థులను రెండో జాబితాలో ప్రకటిస్తారని.. జనసేన నుంచి 10 మంది అభ్యర్థులను ఖరారు చేస్తారని తెలుస్తోంది. ఇప్పటికే టీడీపీ -94 , జనసేన-5 సీట్లలో అభ్యర్థులను ప్రకటించారు. మరో 19 మంది జనసేన అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. అయితే అభ్యర్థులను ప్రకటించిన ఆయా నియోజకవర్గాల్లో అసంతృప్తుల జ్వాలలు ఎగిసిపడుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు. ఇరు పార్టీల నేతల్లో అసంతృప్తిని తగ్గించేందుకు ఏం చేయాలనే అంశాలపై చర్చిస్తున్నారు. ఇప్పటికే పలువురు సీనియర్ నేతలను బుజ్జగించారు. మిగిలిని వారిని దారికి తీసుకొచ్చేందుకు సమాలోచనలు చేస్తున్నారు.  సాయంత్రం కల్లా అసంతృప్తుల అంశం ఓ కొలక్కి వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఈ పరిణామాలను అటు అధికార పార్టీ నిశితంగా గమనిస్తోంది. దీంతో  ఏపీ రాజకీయాలు ఒక్కసారిగా ఆసక్తికరంగా మారాయి.

Read More..

మెగా బ్రదర్ నాగబాబుకు టికెట్ ఉందా లేదా..? 

Tags:    

Similar News