Ap Politics:చెవిరెడ్డి అరాచక, కుటుంబ పాలన అంతమే లక్ష్యం: టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి
ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరాచక, కుటుంబ పాలన అంతమే లక్ష్యంగా పని చేయాలని చంద్రగిరి నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని పిలుపునిచ్చారు.
దిశ,చంద్రగిరి:ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరాచక, కుటుంబ పాలన అంతమే లక్ష్యంగా పని చేయాలని చంద్రగిరి నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని పిలుపునిచ్చారు. గురువారం చిన్నగొట్టిగల్లు మండలం, భాకరాపేటలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీపీ సునీతా దామోదరం, 100 వైసీపీ కుటుంబాలు ఆ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా పులివర్తి నాని ఆధ్వర్యంలో ఊర్జ రిసార్ట్స్ నుంచి భాకరాపేట గాంధీ విగ్రహం వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. యువత బాణాసంచా, డప్పుల మోతలతో హోరెత్తించారు. భాకరాపేట పురవీధులు పసుపు జెండాలతో రెపరెపలాడింది. అనంతరం జరిగిన బహిరంగ సభలో పులివర్తి నాని మాట్లాడుతూ నాపై నమ్మకంతో పార్టీలో చేరిన వైస్ ఎంపీపీ వారి అనుచరులు, వైసీపీ కుటుంబాలకు ధన్యవాదాలు తెలిపారు.
ప్రజా సమస్యలపై వైస్ ఎంపీపీ సునీత దామోదరం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగిన ఏ ఒక్క సమస్యను పరిష్కరించ లేదన్నారు. ప్రజలకు సేవ చేయలేనప్పుడు పార్టీలో ఉండి కూడా ఉపయోగం లేదనుకుని వారు వైసీపీని వీడారన్నరు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే స్థానిక నాయకులు ద్వారా చిన్నగొట్టిగల్లు మండలంలోని 13 పంచాయితీల్లో సమస్యలు పరిష్కరిస్తామన్నారు. పింఛన్లు పంపిణీ చేయకపోవడంతో ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి విఫలమయ్యారని విమర్శించారు. ఒక్కో సచివాలయంలో 10 నుంచి 15 మంది సిబ్బంది ఉన్నారు. వారి చేత ఎందుకు పింఛన్లు పంపిణీ చేయించలేదని ప్రశ్నించారు. ప్రజల అవసరాలు, సమస్యలు చూసి అధికారులు పరిష్కరించాలని కోరారు.
గతంలో వలంటీర్ వ్యవస్థ లేకున్న తెలుగుదేశం పార్టీ సకాలంలో పింఛన్లు అందజేసిన విషయాన్ని గుర్తు చేశారు. రెండు సార్లు దామలచెరువు మార్గం ద్వారా యాత్ర చేపట్టిన సీఎం జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చలేదని ఆరోపించారు. మైనారిటీలు ఎక్కువుగా ఉన్న దామలచెరువు లో సర్పంచ్ పదవి ఆ సామాజిక వర్గానికి కేటాయిస్తానని, కోల్డ్ స్టోరేజ్, మార్కెట్ నిర్మిస్తానని చెప్పి విస్మరించారన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యే, ఆయన కుటుంబ సభ్యులు ఎదిగారే తప్ప జెండా మోసిన కార్యకర్తలు అలాగే ఉండిపోయారని అన్నారు. 5 వేల కోట్లు అక్రమ ఆస్తులు కూడగట్టుకున్న ఎమ్మెల్యే చెవిరెడ్డి ఓటమి భయంతో రెండు జిల్లాలు దాటి వెళ్లారని దుయ్యబట్టారు.
రాక్షసుడుకి దూరంగా నిజాయితీపరుడుకి దగ్గరగా ఉందామని వైసీపీ నుంచి టీడీపీలో చేరిన నేత మోహన్ అన్నారు. పులివర్తి నాని గెలిస్తే ప్రతి ఇంట్లో ఓ ఎమ్మెల్యే ఉన్నట్లేనని పేర్కొన్నారు. మన సమస్యలు తీరాలంటే నియోజకవర్గం అభివృద్ధి చెందాలన్న పులివర్తినానితోనే సాధ్యమని స్పష్టం చేశారు. పార్టీలో చేరిన వారిలో మండల వైస్ ఎంపీపీ సునీతతో పాటు దాము, మోహన్, జయరామయ్య, మురళి, బాలు, మురళి, కార్తీక్, ప్రభు, గురు, ముని, నాని, ఉదయ్, నీలు, ముని, శీను చట్టేవారి పాలెం పంచాయతీకి చెందిన ఎక్స్ ఎంపీపీ సోదరుడు వి నారాయణ, చంగల్ రాయులు, శంకర్ తదితరులు ఉన్నారు.