నాగార్జున సాగర్ డ్యాం వద్ద ఉద్రిక్తత.. వివాదంపై మంత్రి అంబటి సీరియస్ రియాక్షన్

నాగార్జున సాగర్ డ్యామ్‌ వద్ద జరిగిన పరిణామాలపై ఏపీ మంత్రి అంబటి రాంబాబు స్పందించారు..

Update: 2023-12-01 07:14 GMT

దిశ, వెబ్ డెస్క్: నాగార్జున సాగర్ డ్యామ్‌ వద్ద జరిగిన పరిణామాలపై ఏపీ మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు వద్ద ఏపీ పోలీసులు దండయాత్ర చేస్తున్నారన్న ప్రచారంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు కావాలనే రెచ్చిగొడుతున్నారని ఆరోపించారు. ఏపీ హక్కును పునరుద్ధరించుకున్నామని చెప్పారు. కృష్ణా జలాల్లో తమ వాటా వాడుకునే స్వేచ్ఛ తమకు ఇవ్వాలన్నారు. ఏపీ ప్రభుత్వ చర్య న్యాయమైందని సమర్థించుకున్నారు. చంద్రబాబు అసమర్థత వల్లే తెలంగాణ పోలీసులు ఏపీ భూభాగంలోకి వచ్చారని చెప్పారు. ఆంధ్రా వైపు కూడా తెలంగాణ పోలీసులే ఉంటున్నారు. తమ వాటా నీటిని విడుదల చేయాలన్నా తెలంగాణ పోలీసుల అనుమతి తీసుకోవాలంటున్నారని మంత్రి అంబటి పేర్కొన్నారు. 

‘సాగర్ కుడి కెనాల్‌ను కూడా తెలంగాణ ఆపరేట్ చేయడం చట్ట విరుద్ధం. 13వ గేటు వరకు కూడా ఏపీ హక్కు.  ఈ అన్యాయం సరిదిద్దటం తప్పా. ఇది చాలా సున్నిత అంశం.. గొడవలు వద్దు. ఏపీ హక్కుల్ని తెలంగాణకు తాకట్టు పెట్టిన వ్యక్తి చంద్రబాబు. మా వాటాకు మించి తీసుకోం. మాది కాని ఒక్క బొట్టు కూడా మాకొద్దు. పురంధేశ్వరి ఎందుకు దిగజారి మాట్లాడుతున్నారు. గత ప్రభుత్వం ఫెయిల్ అయితే.. మా ప్రభుత్వం విజయం సాధించింది. తెలంగాణలో ఓ పార్టీని గెలిపించి.. మరో పార్టీ ఓడించాల్సిన అవసరం మాకు లేదు. తెలంగాణలో ఎవరు అధికారంలోకి వచ్చినా మాకు అవసరం లేదు.’ అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు.

కాగా నాగార్జున సాగర్ డ్యామ్‌ వద్ద మరోసారి తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కృష్ణా నదీ జలాల పంపకాలపై ఏపీ, తెలంగాణ మధ్య మళ్లీ ఘర్షణ వాతావరణం నెలకొంది. డ్యామ్‌పై తమకు సమాన హక్కులు ఉన్నాయంటూ బుధవారం రాత్రి ఏపీ పోలీసులు చొచ్చుకెళ్లిన విషయం తెలిసిందే. డ్యామ్ 13వ గేటు దగ్గర ముళ్ల కంచె ఏర్పాటు చేయడంతో పాటు.. రైట్ కెనాల్ ద్వారా ఏపీకి నీటిని విడుదల చేశారు. దీంతో రెండు రాష్ట్రాల మధ్య మరోసారి ఉద్రిక్తత నెలకొంది. డ్యామ్‌కు ఇరువైపులా రెండు రాష్ట్రాల పోలీసులు భారీ సంఖ్యలో మోహరించారు. ప్రస్తుతం నాగార్జున సాగర్ డ్యామ్ వద్ద పరిస్థితి యుద్ధ వాతావరణాన్ని తలపిస్తోంది.

Tags:    

Similar News