ప్రధాని మోడీ గురించి మాట్లాడే అర్హత ఏపీ నేతలకు లేదు.. బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
ప్రపంచంలోనే భారతదేశాన్ని నెంబర్ వన్‌గా నిలిపిన ప్రధాని నరేంద్ర మోడీ గురించి మాట్లాడే అర్హత ఏపీ నేతలకు లేదని ఏపీ బీజేపీ మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు.
దిశ, వెబ్‌డెస్క్ : ప్రపంచంలోనే భారతదేశాన్ని నెంబర్ వన్‌గా నిలిపిన ప్రధాని నరేంద్ర మోడీ గురించి మాట్లాడే అర్హత ఏపీ నేతలకు లేదని ఏపీ బీజేపీ మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. ఇవాళ ఆయన రాజమండ్రిలో మీడియాలో మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ ప్రథకాలను రాష్ట్ర పథకాలుగా చెప్పుకుంటూ వైసీపీ ప్రభుత్వం పబ్బం గడుపుకుందని మండిపడ్డారు. సీఎం జగన్ అమలు చేస్తున్న నవ రత్నాలు కంటితుడుపు చర్యేనని ధ్వజమెత్తారు. ప్రధాని మోదీ ఏపీలో కోటి మందికి బియ్యం ఉచితంగా అందజేస్తున్నారని గుర్తు చేశారు.
ఎకరానికి రెండు పంటలకు గాను కిసాన్ సమ్మాన్ యోజన కింద రూ.18 వేల సబ్సిడీ మోదీ ఇస్తున్నారని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్‌ను వైఎస్సార్ ఆరోగ్య మందిర్‌గా పేరు మార్చి దొంగ ప్రచారలకు జగన్ ప్రభుత్వం పూనకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రానున్న అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో మెజారిటీ సీట్లు సాధించేందుకు ఇప్పటి నుంచే ప్రణాళిలకలు సిద్దం చేస్తున్నామని పేర్కొ్న్నారు. ప్రచారంలో భాగంగా కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళతామని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో తాను పోటీలో ఉంటానని సోము వీర్రాజు వెల్లడించారు.