ప్రభుత్వమే మోసం చేస్తే ఎలా?.. ఏపీ జేఏసీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు
రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులు మంగళవారం నుంచి వర్క్ టూ రూల్ పాటించాలని పిలుపు ఇస్తున్నామని ఏపీ జేఏసీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు.
దిశ, డైనమిక్ బ్యూరో : రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులు మంగళవారం నుంచి వర్క్ టూ రూల్ పాటించాలని పిలుపు ఇస్తున్నామని ఏపీ జేఏసీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ సందర్భంగా విజయవాడలో మంగళవారం వర్క్ టూ రూల్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో అన్ని ఉద్యోగ సంఘాలు పాల్గొనాలని బొప్పరాజు విజ్ఞప్తి చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం 11 పీఆర్సీ అరియర్‌లు ఇవ్వక పోగా ఇవ్వాల్సిన బకాయిలు ఆలస్యం చేస్తుందని ఏపీ జేఏసీ అమరాతి అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు ఆరోపించారు. పీఆర్సీ అరియర్లు ఉద్యోగ విరమణ తర్వాత తీసుకోవడం ఏమిటని ప్రశ్నించారు.
పే స్కేల్ విషయంలో ప్రభుత్వమే సొంత ఉద్యోగులకు అన్యాయం చేస్తుందని ఆరోపించారు. ఇంత దుర్మార్గం ఎక్కడైనా ఉంటుందా? అని బొప్పరాజు ఆవేదన వ్యక్తం చేశారు. 2015లో ఇస్తున్న అలవెన్సులు అమలు అవుతున్నాయని.. జీత భత్యాలు కూడా ఒకటో తేదీకి ఇవ్వకుండా ప్రభుత్వం పే స్కేలు మోసాలు కూడా చేస్తోందని ఆరోపించారు. ప్రభుత్వం ఉద్యోగులకు ఎలాంటి బకాయిలు లేవని అసెంబ్లీలో మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రకటించడం దుర్మార్గమన్నారు. ఏప్రిల్ 5వ తేదీ వరకు వర్క్ టూ రూల్ ఉంటుందని బొప్పరాజు వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు.