రాష్ట్ర వ్యాప్త కులగణనకు ఏపీ ప్రభుత్వం ఏర్పాట్లు.. పారదర్శంగా నిర్వహించాలని సూచన
ఏపీలో పూర్తి స్ధాయి కులగణన చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్దమైంది
దిశ వెబ్ డెస్క్: ఏపీలో పూర్తి స్ధాయి కులగణన చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్దమైంది. ఇప్పటికే పైలట్ ప్రాజెక్టు కింద రాష్ట్రంలోని 6 జిల్లాల్లోని 7 సచివాలయాల పరిధిలో కులగణన నిర్వహించగా, రేపటి నుంచి రాష్ట్రావ్యాప్తంగా ప్రతీ గ్రామంలో కులగణన చేపట్టాలని సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. ఈ కులగణన కార్యక్రమం రేపు మొదలై 10 రోజుల పాటు సాగి ఈ నెల 28 న ముగియనుందని తెలిపారు.
ప్రతీ సచివాలయ పరిధిలోని వాలంటీర్లు ఇళ్లకు వెళ్లి వారి వివరాలు సేకరించాలని పేర్కొన్నారు. ఒకవేళ ఎవరైనా వివరాల నమోదు చేయడానికి కుదరకపోతే ఈ నెల 29 నుంచి ఫిబ్రవరి 2 వ తేదీ వరకు నమోదు చేసుకునేందుకు మరో అవకాశం కల్పిస్తామని పేర్కొన్నారు. ఈ వివరాలు ఆన్ లైన్ ద్వారా సేకరించాల్సి ఉండగా, మారుమూల గ్రామాల్లో సిగ్నల్ లోపం ఉండటంతో ఆఫ్ లైన్ ద్వారా నమోదు చేయాలని సూచించారు. ఈ కులగణన ప్రక్రియను పారదర్శకంగా ఆన్‌లైన్ విధానంలో నమోదు చేసేందుకు గానూ గ్రామ, వార్డు సచివాలయాల శాఖ ఒక ప్రత్యేక మొబైల్ యాప్‌ను సిద్ధం చేసింది.
దాదాపు 723 కులాల జాబితాలను ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ కేటగిరీల వారీగా వర్గీకరించి ఆ మొబైల్ యాప్‌లో అనుసంధానించారు. 723 కులాలకు అదనంగా మరో 3 కులాలు బేడ జంగం లేదా బుడగ జంగం, పిరమలై కల్లర్ (తేవర్), యలవ కులాలకు సంబంధించిన వారి వివరాలను వేరుగా ఇతరుల కేటగిరిలో నమోదు చేయనున్నారు. వీటితో పాటు నో క్యాస్ట్ కేటగిరీని కూడ కులగణన ప్రక్రియలో నమోదు చేయాలని నిర్ణయించారు.కులగణన ప్రక్రియలో అత్యంత పారదర్శకంగా వివరాల నమోదు తర్వాత కుటుంబంలో ఎవరైనా ఒక వ్యక్తి నుంచి ఆధార్‌తో కూడిన ఈ కేవైసీని తీసుకోనున్నారు. ఈ ప్రక్రియను జిల్లాల కలెక్టర్ల ఆధ్వర్యంలో పర్యవేక్షించనున్నారు.
ఇప్పటికే రాష్ట్రంలోని 6 జిల్లాల్లోని 7 సచివాలయాల పరిధిలో పైలట్ ప్రాజెక్టుగా నిర్వహించిన కులగణన విజయవంతం అయ్యింది. ఈ కార్యక్రమంలో 3323 కుటుంబాలకు సంబంధించి 7195 మంది వివరాలను నమోదు చేశారు. శ్రీకాకుళం, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, ఎన్టీఆర్, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, వైఎస్సార్ కడపతోపాటు అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో కొన్ని సచివాలయాల పరిధిలో పైలట్ ప్రాజెక్టు నిర్వహించగా, రేపటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది.