Pithapuram: పవన్ ఇలాకలో అధ్వానంగా పాదగయ ఆలయం
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సొంత నియోజకవర్గం పిఠాపురంలో పవిత్ర పాదగయ ఆలయం అధ్వానంగా మారింది...
దిశ, వెబ్ డెస్క్: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Deputy CM Pawan Kalyan) సొంత నియోజకవర్గం పిఠాపురం(Pithapuram)లో పవిత్ర పాదగయ ఆలయం(Padagaya Temple) అధ్వానంగా మారింది. ఆలయం చుట్టూ చెత్తా, చెదారం, మురికి పేరుకుపోయింది. శివరాత్రి నుంచి ఆలయం పుష్కరిణి నీళ్లను శుభ్రం చేయలేదు. నీలం రంగులో ఉండాల్సిన నీళ్లు నల్లగా మారాయి. దీంతో భక్తులు మండిపడుతున్నారు. పుష్కరిణిలో స్నానం చేస్తే ఒళ్లంతా దురదలు వస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలయంలో అధికారుల నిర్లక్ష్యం పరాకాష్ఠకు చేరిందని ధ్వజమెత్తారు. నిత్యం పూజలు చేసే శివలింగం, నందీశ్వరుడి విగ్రహాలపై కుక్కలు మూత్ర విసర్జన చేస్తున్నాయని వ్యాఖ్యానించారు. ఆలయంలో యధేచ్ఛగా శునకాలు సంచరిస్తున్నా అధికారులు పట్టించుకోవడంలేదని ఆరోపించారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని పవన్ కల్యాణ్‌కు భక్తులు విజ్ఞప్తి చేస్తున్నారు.