AP Budget: రేపే ఏపీ బడ్జెట్.. వీటిపైనే ఫోకస్
రేపట్నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. మంత్రి పయ్యావుల కేశవ్ తొలిసారి అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు.
దిశ, వెబ్ డెస్క్: రేపటి నుంచి (నవంబర్ 11) ఏపీ అసెంబ్లీ సమావేశాలు (AP Assembly Sessions)ప్రారంభం కానున్నాయి. ఉదయం 9 గంటలకు మంత్రివర్గం సమావేశమై.. బడ్జెట్ కు ఆమోదం తెలుపనుంది. 10 గంటలకు అసెంబ్లీ, శాసన మండలి సమావేశాలు ప్రారంభమవుతాయి. గవర్నర్ ప్రసంగం అనంతరం.. 11 గంటల 11 నిమిషాలకు మంత్రి పయ్యావుల కేశవ్ అసెంబ్లీలో, మంత్రి అచ్చెన్నాయుడు మండలిలో బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. పయ్యావుల కేశవ్ మంత్రిగా ప్రవేశపెడుతున్న తొలి బడ్జెట్ ఇది. బడ్జెట్ అనంతరం అసెంబ్లీ, శాసన మండలి వాయిదా పడనున్నాయి. తదుపరి స్పీకర్ అధ్యక్షతన బీఏసీ సమావేశం జరుగనుంది. ఈసారి 10 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనిపై బీఏసీ సమావేశంలో నిర్ణయం తీసుకోనుంది.
కాగా.. నాలుగు నెలల్లో 2024-25 ఆర్థిక సంవత్సరం ముగియనుండగా.. ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టనుంది. ఈ సారి బడ్జెట్ లో సంక్షేమానికి ప్రాధాన్యమివ్వనున్నట్లు తెలుస్తోంది. మహిళలకు ఇస్తామన్న పథకాల అమలుపై ఫోకస్ పెట్టనుంది ప్రభుత్వం. అనేక కీలక బిల్లులను కూడా ప్రవేశపెట్టి ఆమోదం తెలిపేలా ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. జన్మభూమి -2, కొత్తరేషన్ కార్డుల పంపిణీపై సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకోనుంది. మహిళలకు రూ.1500, 10 లక్షల రూపాయల వరకూ వడ్డీలేని రుణాలు అంశాలపై బడ్జెట్ లో చర్చించనున్నారు.