Supreme Court: వైసీపీకి మరోసారి భంగపాటు

వీలైనంత త్వరగా విశాఖ నుంచి పరిపాలన చేయాలని వైసీపీ ప్రభుత్వం యోచిస్తోంది. దాదాపు ఏప్రిల్ నెల నుంచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సైతం అక్కడకు వెళ్లిపోయి అక్కడ నుంచే పరిపాలన చేపట్టాలని నిర్ణయించారు..

Update: 2023-03-02 11:43 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : వీలైనంత త్వరగా విశాఖ నుంచి పరిపాలన చేయాలని వైసీపీ ప్రభుత్వం యోచిస్తోంది. దాదాపు ఏప్రిల్ నెల నుంచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సైతం అక్కడకు వెళ్లిపోయి అక్కడ నుంచే పరిపాలన చేపట్టాలని నిర్ణయించారు. ఇందుకు ఏర్పాట్లు సైతం చకచకా జరిగిపోతున్నాయి. అలాగే ప్రభుత్వ రంగ కార్యాలయాల కోసం అన్వేషణ సైతం జరుగుతుంది. అయితే రాజధాని అంశంపై సుప్రీంకోర్టులో విచారణ జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఆ తీర్పు రాకుండా వెళ్తే లీగల్ పరంగా ఇబ్బందులు తలెత్తుతాయని వైసీపీ ప్రభుత్వం భావిస్తోంది. కేసు సుప్రీంకోర్టులో విచారణ దశలో ఉన్నప్పటికీ సీఎం జగన్ విశాఖనే పరిపాలన రాజధానిగా హస్తినలో ప్రకటించారు. ఇక లీగల్ ఇష్యూ అనేది లేకుండా ఉండేందుకు సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్‌ను అత్యవసర కేసుగా భావించి విచారణ చేపట్టేలా చర్యలు తీసుకోవాలని భావించింది.

కోర్టులో క్లియరెన్స్ కోసం ప్రయత్నం

విశాఖ కేంద్రంగా పరిపాలన ప్రారంభించడానికి ముందే న్యాయపరమైన చిక్కుల్ని తొలగించుకోవాలని ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా ప్రభుత్వం తరఫు న్యాయవాదులు సుప్రీంకోర్టులో కేసు విచారణను త్వరితగతిన ముగించేందుకు ప్రయత్నిస్తున్నారు. కోర్టులో క్లియరెన్స్ కోసం ప్రయత్నిస్తున్నారు. అయితే సుప్రీం కోర్టులో మాత్రం ఎదురుదెబ్బ తగులుతూనే ఉంది. ఇప్పటికే ఈ కేసు విచారణను మార్చి 28న చేపట్టాలని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. అంతవరకు వేచి చూడలేమని త్వరగా విచారణ ముగిసేలా చేయాలని విజ్ఞప్తి చేసినా తిరస్కరించింది. దీంతో ప్రభుత్వం విజ్ఞప్తులకు సుప్రీంకోర్టు తిరస్కరణ ఎదురవుతుండటంతో ఈ కేసు తీర్పుపై ఉత్కంఠ నెలకొంది. ప్రభుత్వం ఆశించిన తీర్పు వస్తుందో లేదో అన్న టెన్షన్ మెుదలైంది.

మరోసారి భంగపాటు

రాజధాని అమరావతికి సంబంధించిన కేసుల అంశంలో వైసీపీ ప్రభుత్వానికి మరోసారి చుక్కెదురైంది. అమరావతి కేసు విచారణ త్వరగా పూర్తి చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం తరఫు న్యాయవాదులు చేసిన విజ్ఞప్తిని జస్టిస్‌ కేఎం జోసెఫ్‌ ధర్మాసనం తోసిపుచ్చింది. త్వరగా పూర్తి చేయడం కుదరదని స్పష్టం చేసింది. ముందుగా పేర్కొన్నట్లు మార్చి 28నే విచారణ చేపడతామని పేర్కొంది. అయితే 28 తేదీ ఒక్కటే సరిపోదని.. మార్చి 29, 30న కూడా విచారించాలని ఏపీ ప్రభుత్వ న్యాయవాదులు మరోక విజ్ఞప్తి చేశారు. ఆ రోజుల్లో విచారణ జరపడం కుదరదని తెలిపింది. మార్చి 29, 30 తేదీలు బుధ, గురువారాలని.. నోటీసులు ఇచ్చిన కేసులను ఆ తేదీల్లో విచారణ జరపరాదని ధర్మాసనం కరాఖండిగా తేల్చి చెప్పేసింది. దీనిపై సీజేఐ సర్క్యులర్‌ ఉందని.. ఆ రెండు రోజుల్లో విచారణ తమ చేతుల్లో లేదని.. ఆ విషయంలో సీజేఐ మాత్రమే నిర్ణయం తీసుకుంటారని జస్టిస్‌ కేఎం జోసెఫ్‌ వెల్లడించారు. దీంతో వైసీపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో మరోసారి భంగపాటు తప్పలేదు.

అత్యవసర విచారణ అవసరం లేదు

గురువారం ఉదయం కోర్టు కార్యకలాపాలు ప్రారంభమైన తర్వాత ఏపీ ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని జస్టిస్‌ కేఎం జోసెఫ్‌ ధర్మాసనం పరిశీలించారు. అత్యవసర విచారణ చేయాల్సిన అవసరం లేదని తెలిపారు. విచారణ త్వరగా పూర్తిచేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం తరఫు న్యాయవాదులు విజ్ఞప్తిని తిరస్కరించారు. అమరావతి రాజధాని కేసు చాలా పెద్దదని.. కేసు విచారణ చేపడితే సార్థకత ఉండాలి కదా అని ప్రశ్నించారు. ఈ కేసు విచారణలో రాజ్యాంగపరమైన అంశాలు చాలా ఇమిడి ఉన్నందువల్ల మరింత సమయం కావాల్సి ఉందన్నారు. పోనీ తమ విజ్ఞప్తిని సీజేఐ ముందు ప్రత్యేకంగా ప్రస్తావించేందుకు అనుమతివ్వాలని ఏపీ ప్రభుత్వం తరఫు న్యాయవాదులు కోరగా ధర్మాసనం అందుకు కూడా నిరాకరించింది.

మార్చి 28న విచారణ

ఇదిలా ఉంటే అమరావతి కేసులను విచారణ జాబితాలో త్వరగా చేర్చాలని రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్‌ న్యాయవాది నిరంజన్‌రెడ్డి గత సోమవారం జస్టిస్‌ కేఎం జోసెఫ్‌, జస్టిస్‌ బి.వి.నాగరత్నతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఎదుట ప్రస్తావించారు. అయితే మార్చి 28న విచారణ చేపడతామని ధర్మాసనం స్పష్టం చేసింది. అయితే తాజాగా మరోసారి మరోసారి కేసులు త్వరగా విచారించాలంటూ రాష్ట్ర ప్రభుత్వం తరఫు న్యాయవాదులు సుప్రీంకోర్టును ఆశ్రయించగా అందుకు కోర్టు తిరస్కరించింది. మార్చి 28నే విచారణ జరుగుతుందని తేల్చి చెప్పింది.

Tags:    

Similar News