ఎన్నికలవేళ ఏపీలో మరో కొత్త పార్టీ ఆవిర్భావం

ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ కొత్త పార్టీ ప్రారంభమైంది.

Update: 2023-11-02 10:25 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ కొత్త పార్టీ ప్రారంభమైంది. ఏపీ పెన్షనర్స్ పార్టీ పేరుతో కొత్త పార్టీ ఏర్పాట్లు చేస్తున్నట్లు పి.సుబ్బరాయన్ ప్రకటించారు. ఈ మేరకు ఆంధ్ర పెన్షనర్స్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పి.సుబ్బారాయన్ మాట్లాడారు. ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగులకు ఒక రాజకీయ వేదిక ఉండాలనే ఆలోచనతో పెన్షనర్స్ పార్టీని స్థాపించడం జరిగిందని వెల్లడించారు. వైసీపీ ప్రభుత్వం పెన్షనర్ల పట్ల నిర్లక్ష్య వైఖరితో వ్యవహరిస్తోందని..పెన్షనర్ల ప్రయోజనాలను ప్రభుత్వం కాల రాస్తోందని ధ్వజమెత్తారు. పెన్షనర్స్ మెడికల్ బిల్లులు, సకాలంలో పెన్షన్‌లు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతోందని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వ విధానాలపట్ల విరక్తితో తాను ఏపీ పెన్షనర్స్ పార్టీని స్థాపించినట్లు తెలిపారు. ఈ ప్రభుత్వం ఉద్యోగులను పట్టించుకోవడం లేదు.. పెన్షనర్లపట్ల నిర్లక్ష్యం, రైతులంటే చులకన భావం చూపిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మేధావుల తమ పార్టీలోకి రావాలని ఏపీ పెన్షనర్స్ పార్టీ అధ్యక్షుడు పి.సుబ్బరాయన్ ఆహ్వానించారు.

త్వరలో భవిష్యత్ కార్యచరణ ప్రకటిస్తాం

ఇకపోతే ప్రతీ ఏడాది జనవరి నెలలో జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని చెప్పిన వైఎస్ జగన్ తీరా అధికారంలోకి వచ్చాక ఖాళీ పోస్టులను కూడా భర్తీ చేయడం లేదని ఏపీ పెన్షనర్స్ పార్టీ అధ్యక్షుడు పి.సుబ్బరాయన్ విమర్శించారు. అంతేకాదు టీచర్‌లను సారా దుకాణాల్లో పని చేసే వారిలా మార్చిందని...రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడటంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందని మండిపడ్డారు. రాష్ట్రంలో నెలకొన్న సమస్యలను చెప్పుకోవడానికి కూడా హోం మంత్రి అందుబాటులో ఉండటం లేదని ఏపీ పెన్షనర్స్ పార్టీ అధ్యక్షుడు పి.సుబ్బరాయన్ వెల్లడించారు. ఇదిలా ఉంటే ఐఆర్ పేరిట పెన్షనర్స్ జీతాల్లో కోత పెట్టింది అని చెప్పుకొచ్చారు. రిటైర్ అయిన వాళ్లకు క్వాంటమ్ పెన్షన్‌లో కోత పెట్టడం ఏంటని మండిపడ్డారు. వైఎస్ జగన్ మాటలు నమ్మే స్థితిలో ఉద్యోగులు, పెన్షనర్లు లేరని..రాబోయే ఎన్నికల్లో తమ సత్తా ఏంటో చూపిస్తామని హెచ్చరించారు. ఇకపోతే త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా పెన్షనర్ల సదస్సు నిర్వహిస్తామని...అదే వేదికపై భవిష్యత్ కార్యచరణ ప్రకటిస్తామని ఏపీ పెన్షనర్స్ పార్టీ అధ్యక్షుడు పి.సుబ్బరాయన్ తెలిపారు.

Tags:    

Similar News