వైసీపీకి దూరంగా మరో ఎమ్మెల్యే.. మైలవరం సీటు ఆ మంత్రికేనా..?
ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో అధికార వైసీపీకి వరుస షాకులు తగులుతున్నాయి
దిశ, డైనమిక్ బ్యూరో: ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో అధికార వైసీపీకి వరుస షాకులు తగులుతున్నాయి. వైసీపీలో ఇన్‌చార్జిల మార్పుతో సీటు దక్కని ఎమ్మెల్యేలు కొందరు పార్టీని వీడుతుండగా, మరికొందరు సీటు విషయం ఎటూ తేలకముందే పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలోనే మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ కూడా ఏలూరులో జరిగే సిద్దం సభకు దూరంగా ఉన్నట్లు తెలిసింది. మైలవరం నియోజకవర్గం నుంచి సిద్దం సభకు జనసమీకరణ చేసే పనులు కేశినేని నాని, పడమట సురేష్ బాబులకు అప్పగించినట్లు తెలిసింది. ఈ సందర్భంగా వారు మైలవరం నియోజకవర్గ ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, మండల కన్వీనర్లతో సమావేశమయ్యారు.
ఇప్పటికే సిద్ధం సభకు అందుబాటులో ఉండనని ఎమ్మెల్యే వసంత కృష్ణ అధిష్టానానికి చెప్పినట్లు సమాచారం. కాగా ఈ మధ్యే వైసీపీ కార్యాలయానికి వెళ్లి వచ్చాక, అభివృద్ది పనులపై వైసీపీ వ్యతిరేఖంగా మాట్లాడిన నేపధ్యంలో వసంత కృష్ణ పార్టీకి గుడ్ బై చెప్పనున్నాడని విస్తృతంగా వార్తలొచ్చాయి. ఇప్పుడు నియోజకవర్గ బాధ్యతలు కేశినేని నాని, పడమట సురేష్ బాబులకు కేటాయించడంతో ఈ వార్తలకు బలం చేకూరినట్లు అయ్యింది. దీనికి ప్రధాన కారణం మంత్రి జోగి రమేష్ అని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. 2014 లో జోగి రమేష్ ఇక్కడి నుంచే పోటీ చేసి ఓడిపోయాడు. 2019 లో మైలవరం నియోజకవర్గంలో తిరుగులేని నేతగా ఉన్న బోండా ఉమని ఓడించి, వసంత కృష్ణప్రసాద్ ఎమ్మెల్యే అయ్యారు.
వసంత గెలిచినా.. జోగి రమేష్ నియోజకవర్గ పార్టీ కార్యక్రమాల్లో జోక్యం చేసుకుంటూ తన వర్గానికి పదవులు ఇప్పించుకోవడంతో ఇద్దరికీ విభేదాలు తలెత్తాయి. హైకమాండ్ పిలిపించి సర్ధిచెప్పినా కూడా జోగి రమేష్ వెనక్కి తగ్గకపోవడంతో ఎమ్మెల్యేలో అసంతృప్తి మొదలైంది. ప్రస్తుతం జోగి రమేష్‌ను పెడన నుంచి పెనమలూరుకు మార్చారు. అయితే అక్కడ పరిస్థితులు అంతగా అనుకూలంగా లేకపోవడంతో మైలవరానికి తీసుకొని రావాలనే యోచనలో అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది. అసంతృప్తితో ఉన్న వసంత కృష్ణ 4,5 తేదీల్లో మీడియా సమావేశం పెట్టి మాట్లాడతానని చెప్పి, హైదరాబాద్ వెళ్లిపోయారు. దీంతో ఎమ్మెల్యే పార్టీని వీడనున్నాడా.. లేదా అనేది మరో మూడు రోజుల్లో తేలనుంది.