MLA Pinnelli: టార్గెట్‌గా పిన్నెల్లి.. తెరపైకి పాత కేసుల చిక్కులు

మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై మళ్లీ ఓ ఫిర్యాదు నమోదైంది.

Update: 2024-08-30 04:23 GMT

దిశ ప్రతినిధి, నరసరావుపేట: మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై మళ్లీ ఓ ఫిర్యాదు నమోదైంది. ఆయన హయాంలో జరిగిన పాత కేసుల్ని ఇప్పుడు కొత్తగా ప్రజలు తిరగబడి ఆయనపైన, ఆయన అనుచరులపై ఫిర్యాదు చేసేందుకు క్యూ కడుతున్నారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అధికారంలో ఉన్నప్పుడు అధికార పార్టీ వారిపై ఎన్ని పిర్యాదులు అందినా చాలా కేసులు పోలీసులు నమోదు చేయలేదు. ఆయన పోలీసు యంత్రాంగాన్ని శాసించి ప్రత్యర్థులపై కేసులు నమోదు చేయించి హడలెత్తించారు. ఆ కేసులే నేడు పిన్నెల్లి మెడకు చుట్టుకోబోతున్నాయనే వాదనలు ఇప్పుడు వినిపిస్తున్నాయి.

ఇందుకు చాలా కారణాలను సొంత పార్టీ నేతలు చెప్పుకొస్తున్నారు. విచ్చలవిడిగా టీడీపీ కార్యకర్తలపై తప్పుడు కేసులు నమోదు చేయించటంతో పాటు పలువురి ఆస్తులను కబ్జాచేశారు. కబ్జాదారులు అధికార పార్టీ వారే కావటంతో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత పెరిగింది. అలాగే ప్రభుత్వ పోరంబోకు భూములు, మున్సిపల్ స్థలాలు పట్టాలు రాయించుకొని స్వాధీనం చేసుకుంటున్నా వారించక పోవటం కూడా పేదల్లో పిన్నెల్లిపై వ్యతిరేకత పెంచింది. అందుకే ఆయన బ్రహ్మారెడ్డి చేతిలో దారుణంగా ఓడిపోయారంటున్నారు.

పిన్నెల్లి పతనం ఇలా..

జూలకంటి బ్రహ్మారెడ్డికి అద్దె ఇల్లు లేకుండా చేశారన్న విషయం పట్టణ ప్రజలలో పిన్నెల్లిపై తీవ్ర వ్యతిరేకత పెంచింది. అదే సమయంలో బ్రహ్మారెడ్డికి సానుభూతి తెచ్చిపెట్టింది. బ్రహ్మారెడ్డి వార్డు పర్యటనకు వెళ్లినప్పుడు తురకా కిషోర్ బ్రహ్మారెడ్డిపై దాడికి దిగాడు. బ్రహ్మారెడ్డి వర్గం ఎదురుదాడికి దిగటంతో కిషోర్ పరారయ్యారు. దీంతో పిన్నెల్లి ఇమేజ్ బాగా మసక బారింది. బ్రహ్మరెడ్డి చరిష్మా పెరిగిపోయింది. అలా పిన్నెల్లి రోజు రోజుకు బలహీనపడ్డారు. పోలింగ్ నాడు ఈవీఎం ధ్వంసం కేసులో పిన్నెల్లి నిందితుడిగా నెల్లూరు సెంట్రల్ జైలులో ఉన్నారు. 55 రోజులు ఉండి బెయిల్‌పై విడుదలైనప్పటికీ ఆయన మాచర్ల కు రాలేదు. బెంగుళూరు, చెన్నైల్లో ఉన్నారని అనుచరులు చెప్పుకొస్తున్నారు. ఇంతలోనే పాత కేసులు వెలుగు చూడటం ప్రారంభం అయ్యింది.

ఆధారాలతో కేసుల నమోదు..

2020లో బుద్దా వెంకన్న బోండా ఉమ వెళ్తున్న కారుపై జరిగిన దాడిలో పిన్నెల్లి ప్రమేయం ఉందని అప్పట్లోనే ఆరోపణలు వచ్చాయి. ఇక టీడీపీ ఇంచార్జ్‌గా జూలకంటి బ్రహ్మరెడ్డిని నియమించాక తరచు ఘర్షణలు జరిగాయని టీడీపీ కార్యకర్తల పై దాడులు పెరిగాయని టీడీపీ ఆధారాలు చూపిస్తోంది. పిన్నెల్లి ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో జరిగిన గత ఘటనలను ఇప్పుడు తాజాగా తెరపైకి తెస్తున్నారు. అందుకే మరికొన్ని కేసులు నమోదు చేసి మళ్ళీ అరెస్టు చేస్తారన్న వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి. తాజాగా టీడీపీ నేత బుద్దా వెంకన్న ఇచ్చిన ఫిర్యాదు కూడా ఈ వార్తలకు బలం చేకూరుస్తోంది.

గతంలో తమ పై జరిగిన దాడిపై పోలీసులకు ఫిర్యాదు చేశామని టీడీపీ నేత బుద్దా వెంకన్న అన్నారు. ఈ దాడిలో తురకా కిషోర్ కీలకంగా వ్యవహరించాడని బుద్దా వెంకన్న ఆరోపించారు. అయితే మొన్ననే జైలు నుంచి విడుదలైన పిన్నెల్లికి మళ్లీ పాత కేసుల చిక్కులు మొదలవ్వటంతో చుక్కలు కనిపిస్తున్నాయి. దీనీకి తోడు మొన్నటి వరకు ఆయన వెంట ఉన్న అనుచరులు టీడీపీకి వలసబాట పడుతున్నారు. అలాగే వైసీపీ ఆధీనంలో ఉన్న మున్సిపాలిటీ నేడు టీడీపీ వశమైంది. పిన్నెల్లి నియోజక వర్గంలో రాజకీయంగా పట్టు కోల్పోతున్నారని అందరికీ అర్థం అయింది. ఈ విషయాన్ని ఆయనతో సన్నిహితంగా మెలిగిన వారే చెబుతున్నారు. ఏం జరుగుతుందో చూడాలి మరి.

వచ్చారు.. వెళ్లారు..

పలు కేసుల్లో నిందితుడుగా జైలులో ఉండి ఇటీవల కండీషనల్ బెయిల్‌పై జైలు నుంచి విడుదలైన మాచర్ల మాజీ ఎమ్యెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గురువారం స్టేషన్‌లో సంతకాలు చేసే నిమిత్తం హైదరాబాద్‌ నుంచి నర్సరావుపేట వచ్చి, తిరుగుప్రయాణంలో మాచర్లకు వచ్చారు. పిన్నెల్లి అరెస్టు తరువాత ఇదే మాచర్లకు రావటం. మాచర్లలోని తన స్వగృహంలో ఉన్న తల్లిదండ్రులను పలకరించి హైదరాబాద్‌ వెళ్లి పోయారు. మార్గమధ్యంలో మాచర్ల మండలం కొత్తపల్లి జంక్షన్‌ వద్ద కొంత మంది వైసీపీ నాయకులు, అభిమానులు పీఆర్కే వెళుతున్న కారును ఆపటంతో వారితో కొంతసేపు మాట్లాడి హైదరాబాద్‌‌కు పయనమయ్యారు.

Tags:    

Similar News