Anna canteen:‘రేపే అన్న క్యాంటీన్లు ప్రారంభం’.. రూ.కోటి విరాళం ఇచ్చిన నారా భువనేశ్వరి
ఏపీలో ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో భారీ విజయం సాధించిన టీడీపీ కూటమి నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయంలో తెలిసిందే.
దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో భారీ విజయం సాధించిన టీడీపీ కూటమి నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేసే దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు 2018లో ఏపీలో ఆకలి అనే పదం వినపడకుడదని అన్న క్యాంటీన్లు ప్రారంభించారని నారా భువనేశ్వరి తెలిపారు. ఈ సారి జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ కూటమి అధికారంలోకి వస్తే అన్న క్యాంటీన్లను పున:ప్రారంభిస్తామని సీఎం చంద్రబాబు చెప్పారని, ఆ మేరకు ఆయన కట్టుబడి ఉన్నారన్నారు.
ఈ సందర్భంగా నారా భువనేశ్వరి మాట్లాడుతూ..అన్నపూర్ణ లాంటి ఆంధ్రప్రదేశ్‌లో ఆకలి అనే పదం వినపడకూడదు అనే మహోన్నత లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్న క్యాంటీన్లను మళ్లీ పునః ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. ఈ నేపథ్యంలో పేదలకు రూ.5 కే రుచికరమైన భోజనం అందించే అన్న క్యాంటీన్లు రేపు (గురువారం) గుడివాడలో సీఎం చంద్రబాబు ప్రారంభిస్తారని చెప్పారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన రోజునే అన్న క్యాంటీన్లు మొదలుకావడం శుభపరిణామం అని నారా భువనేశ్వరి అన్నారు. పేదల ఆకలి తీర్చే ఈ మహత్తర కార్యక్రమం కోసం ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ తరఫున కోటి రూపాయలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి విరాళంగా అందిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని చెప్పారు. నిరుపేదల ఆకలి తీర్చే ఈ మహాయజ్ఞంలో మీ వంతు సహకారాన్ని అందించాలని విజ్ఞప్తి చేస్తున్నానని నారా భువనేశ్వరి ట్విట్టర్ వేదికగా తెలిపారు.