Ap Breaking: వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీదే అధికారం.. తేల్చేసిన ఆత్మసాక్షి సర్వే

మరో 14 నెలల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో గెలుపొందేందుకు అన్ని పార్టీలు రంగంలోకి దిగాయి. అధికారమే పరమావధిగా పార్టీలన్నీ ఎన్నికల వ్యహరచన చేస్తున్నాయి...

Update: 2023-02-10 10:14 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: మరో 14 నెలల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో గెలుపొందేందుకు అన్ని పార్టీలు రంగంలోకి దిగాయి. అధికారమే పరమావధిగా పార్టీలన్నీ ఎన్నికల వ్యహరచన చేస్తున్నాయి. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ ఇప్పటికే సర్వేలు మీద సర్వేలు చేయిస్తున్నాయి. ఇప్పటికే సింగిల్‌గానే పోటీ చేస్తామని అధికారంలోకి వస్తామని వైసీపీ చెప్తోంది. అయితే టీడీపీ మాత్రం భావసారుప్యత కలిగిన పార్టీలతో కలిసి పోటీ చేస్తామని బాహటంగానే చెప్తోంది.

ఇప్పటికే ఏపీలో జనసేన-బీజేపీలు పొత్తులో ఉన్నాయి. అయితే టీడీపీ-జనసేన పార్టీల మధ్య పొత్తు ఖరారైపోయినట్లు తెలుస్తోంది. అధికారికంగా గత ఏడాది నవంబర్‌లోనే పొత్తు కన్ఫర్మ్ అయ్యిందని ఇందులో భాగంగానే బీజేపీతో పవన్ కల్యాణ్ అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారనే ప్రచారం కూడా ఉంది. అయితే టీడీపీ-జనసేన పార్టీలు పొత్తుతో ఎన్నికలకు వెళ్తే ఎలాంటి ఫలితాలు వస్తాయి...? ఒకవేళ బీజేపీ-టీడీపీ-జనసేన పార్టీలు కలిసి 2014 ఎన్నికలకు వెళ్లినట్లు వెళ్తే అధికారంలోకి వస్తాయా..? అసలు ప్రజలు సింగిల్‌గా వస్తున్న జగన్‌ను ఆదరిస్తారా లేక టీడీపీ- జనసేనల పొత్తును స్వాగతిస్తారా..? లేదంటే టీడీపీ-బీజేపీ- జనసేన పొత్తులను తిరస్కరిస్తారా? అన్న అంశాలపై సామాన్య ప్రజలు సైతం చర్చించుకుంటున్నారు. అయితే ఈ ప్రశ్నల చిక్కుముడి విప్పేందుకు శ్రీ ఆత్మసాక్షి సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో ప్రజల నాడి ఎలా ఉందో చెప్పేసింది. అయితే ఈ సర్వేలో ఏం తేలింది. ప్రజలు వైసీపీకే పట్టంకట్టారా?, లేక పొత్తులను స్వాగతించారా?, అసలు ఏ నియోజకవర్గాల్లో టఫ్ ఫైట్ నడుస్తోంది?, అనే దానిపై క్లారిటీ ఇచ్చేసింది. జాతీయ మీడియా సంస్థలు నిర్వహించిన సర్వేల్లో ఫలితాలన్నీ వైసీపీవైపే ఉండటంతో శ్రీఆత్మసాక్షి సర్వేలో ఏం తేలిందో అన్న దానిపై ఉత్కంఠ నెలకొంది.

శ్రీ ఆత్మసాక్షి సర్వేలో తేలిందేంటంటే..


తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల వేడి మెుదలైంది. ఎన్నికలకు సమయం సమీపిస్తున్న తరుణంలో ఆయా పార్టీలు అధికారంలోకి వచ్చేందుకు పక్కా ప్రణాళికతో ఎన్నికల కదన రంగంలోకి దుమికాయి. అంతేకాదు ఓటరు నాడిని ఎలా పట్టాలి అనేదానిపై పార్టీలు సతమతమవుతున్నాయి. ఒకవైపు జాతీయ మీడియా సంస్థలు చేపట్టిన సర్వేలలో మళ్లీ ప్రజలు వైసీపీకే పట్టం కడతారని తేల్చేశాయి. ఇదే సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేశ్ పాదయాత్ర, పవన్ పర్యటనలకు విపరీతంగా ప్రజలు తరలివస్తుండటంతో అసలు ఓటరు నాడి ఏవిధంగా ఉంది. జాతీయ మీడియా సంస్థల సర్వేలు చెప్తున్నట్లు ప్రజలు వైసీపీకే పట్టం కడితే ఇంతలా జనం చంద్రబాబు, లోకేశ్, పవన్ కల్యాణ్‌ల సభలకు తరలివస్తారనే దానిపై చర్చ జరుగుతుంది.

అయితే తెలుగు రాష్ట్రాల సర్వేల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సంస్థ శ్రీఆత్మసాక్షి. ఈ సంస్థ ఇటీవలే సర్వే చేసి ఓటరు నాడిని పసిగట్టింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనేది తేల్చి చెప్పేసింది. మొత్తం నాలుగు విభాగాలుగా సర్వే చేపట్టింది. వైసీపీ,టీడీపీ, జనసేన పార్టీలు విడివిడిగా పోటీ చేస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయి?, టీడీపీ-జనసేన పార్టీలు కలిసి పోటీ చేస్తే ఎలాంటి రిజల్ట్స్ వస్తాయి?, టీడీపీ-జనసేన-బీజేపీ కలిసి పోటీ చేస్తే వచ్చే ఫలితాలు, టీడీపీ-జనసేన-వామపక్షాలు కలిసి పోటీ చేస్తే వచ్చే ఎన్నికల ఫలితాలపై సర్వే నిర్వహించింది. అయితే ఈ సర్వేలో పొత్తులకే ప్రజలు పట్టంకట్టారని నిర్ధారించింది.

అధికారం నిర్ణయించేది 1.25 ఓటర్లే

2024 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో ప్రజల తీర్పు ఎలా ఉండబోతుందని తెలుసుకునేందుకు శ్రీ ఆత్మసాక్షి (ఎస్ఏఎస్) గ్రూప్ సంస్థ సర్వే నిర్వహించింది. ఈ సర్వే నివేదికను ఫిబ్రవరిలో విడుదల చేసింది. ఆత్మసాక్షి సర్వే ప్రకారం 2024లో రాష్ట్ర ప్రజలు తెలుగుదేశం పార్టీకే పట్టం కట్టనున్నారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే తెలుగుదేశం 78 స్థానాల్లో విజయం సాధించే అవకాశాలున్నాయని పేర్కొంది. మరోవైపు వైసీపీ 63 స్థానాల్లో గెలిచి రెండో స్థానంలో నిలుస్తుంది. జనసేన పార్టీ 7 స్థానాల్లో గెలుపొంది మూడో స్థానానికి పరిమితమవుతుందని శ్రీ ఆత్మసాక్షి వెల్లడించింది. అయితే నువ్వా నేనా అన్న ట్లుగా 27 స్థానాలలో పోటీ ఉంటుందని పేర్కొంది. అంటే టీడీపీ లేదా వైసీపీ ఈ రెండు పార్టీలు అధికారంలోకి రావాలంటే ఈ టఫ్ ఫైట్‌లో సాధించే సీట్లపైనే ఆధారపడి ఉంటుంది. ఇరుపార్టీలు అధికారానికి 1.25శాతం దూరంలో నిలిచిపోతారని నిర్ధారించింది. 1.25 శాతం ఓటర్లు నిర్ణయాత్మక శక్తిగా నిలవనున్నారని సర్వేలో తేలింది. ఈ ఫలితాలు కేవలం మూడు పార్టీలు విడివిడిగా పోటీ చేస్తే వెల్లడయ్యే ఫలితాలని శ్రీఆత్మసాక్షి సర్వే వెల్లడించింది.

టీడీపీ-జనసేన పొత్తుకు సై

తెలుగుదేశం-జనసేన పార్టీలు కలిసి పోటీ చేస్తే అధికారంలోకి రావడం ఖాయమని సర్వేలో తేలింది. పొత్తులో భాగంగా ఎన్నికలకు వెళ్తే వైసీపీకి 65 స్థానాల్లో గెలుపొందే అవకాశం ఉందని.. అయితే టీడీపీ-జనసేన పార్టీలు కలిసి 110 స్థానాల్లో గెలుపొందుతారని తెలిపింది. అయితే 10 నుంచి 12 స్థానాల్లో టగ్ ఆఫ్ వార్ నడుస్తోందని, అంతిమంగా టీడీపీ-జనసేన పార్టీలు అధికారంలోకి రావడం ఖాయమని నిర్ధారించింది. మరోవైపు టీడీపీ-జనసేన-వామపక్షాలు కలిసి పోటీ చేసినా ఈ కూటమి అధికారంలోకి రావడం ఖాయమని తేల్చేసింది. ఈ మూడు పార్టీలు పొత్తులో భాగంగా ఎన్నికలకు వెళ్లే వైసీపీ 60 సీట్లకే పరిమితమవుతుందని టీడీపీ-జనసేన-వామపక్ష పార్టీలు 116 చోట్ల గెలుపొందుతాయని నిర్ధారించింది. అయితే 3 నుంచి 4 స్థానాల్లో గట్టి పోటీ ఉంటుందని తెలిపింది. అయితే రాష్ట్రంలో 57 శాతం పబ్లిక్ ఈ పొత్తును స్వాగతిస్తున్నట్లు శ్రీఆత్మసాక్షి సర్వేలో తేటతెల్లమైంది.

బీజేపీతో పొత్తుకు నై

టీడీపీ-జనసేన-బీజేపీ పార్టీల పొత్తును ప్రజలు స్వాగతించడం లేదని ఈ సర్వేలో తేటతెల్లమైంది. మూడు పార్టీలు వైసీపీపై పోటీకి వెళ్తే వైసీపీ 90 స్థానాల్లో గెలుపొంది అధికారంలోకి వస్తుందని తెలిపింది. ఇకపోతే టీడీపీ, జనసేన, బీజేపీ మూడు పార్టీలు కలిసి 68 స్థానాలకే పరిమితమై ప్రతిపక్ష హోదాకే పరిమితమవుతారని తెలిపింది. అయితే నాలుగు నుంచి 8 సీట్లలో గట్టి పోటీ ఉంటుందని తెలిపింది.

Tags:    

Similar News