ఆరంభం నుంచీ లాడ్జే.. సచివాలయం పరిస్థితి ఇదీ..

ప్రజలకు సేవలందించాల్సిన ప్రభుత్వ కార్యాలయం లాడ్జిగా మారింది. అనంతపురం జిల్లా కంబదూరు పరిధిలోని సచివాలయం-4 ప్రారంభం అయినప్పటి నుంచి ప్రభుత్వ కార్యకలాపాలకు నోచుకోలేదు.

Update: 2024-10-24 02:29 GMT

దిశ, కళ్యాణదుర్గం: ప్రజలకు సేవలందించాల్సిన ప్రభుత్వ కార్యాలయం లాడ్జిగా మారింది. అనంతపురం జిల్లా కంబదూరు పరిధిలోని జిల్లా పరిషత్ పాఠశాల, రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న సచివాలయం-4 ప్రారంభం అయినప్పటి నుంచి ప్రభుత్వ కార్యకలాపాలకు నోచుకోలేదు. అల్లరిమూకలు, మందుబాబులు దీన్ని ఆసరాగా చేసుకొని ప్రభుత్వ గ్రామ సచివాలయాన్ని లాడ్జ్ గా మార్చుకున్నారు. కార్యాలయం తాళాలను, కిటికీల అద్దాలను ధ్వంసం చేశారు. నిత్యం మద్యం తాగుతూ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతుండటంపై గ్రామ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యంగా కారణంగానే మందుబాబులు రెచ్చిపోతున్నారని పలువురు వాపోతున్నారు.

దేవాలయం లాంటి ప్రభుత్వ కార్యాలయాన్ని రాసలీలలకు ఉపయోగిస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొందరి విలేకరులు గ్రామ సచివాలయాన్ని పరిశీలించగా అందులో మందు బాటిళ్లు, పరుపులు, చీరలు కనిపించాయి. వీటితోపాటు పక్కన ఉన్న ఇతర ప్రభుత్వ కార్యాలయాల్లో కిటికీలు, శిలాఫలకాలు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు కళ్లు తెరిచి ప్రభుత్వ కార్యాలయాలకు రక్షణ కల్పించాలని ప్రజలు కోరుతున్నారు.


Similar News