TDP: జే గ్యాంగ్ ముఠా ఆటకట్టించాల్సిందే!
జగన్ దొంగ తెలివితేటలు, భూ కుంభకోణాలకు అతిపెద్ద నిదర్శనం లేపాక్షి నాలెడ్జ్ హబ్ భూదోపిడీ అని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు కాలవ శ్రీనివాసులు ఆరోపించారు..
దిశ, డైనమిక్ బ్యూరో : జగన్ దొంగ తెలివితేటలు, భూ కుంభకోణాలకు అతిపెద్ద నిదర్శనం లేపాక్షి నాలెడ్జ్ హబ్ భూదోపిడీ అని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు కాలవ శ్రీనివాసులు ఆరోపించారు. పరిశ్రమలు, ఉద్యోగాలని ఆశచూపి, రైతులనోట్లో మట్టికొట్టి, వారిపిల్లల జీవితాల్ని రోడ్డునపడేసి, అంతిమంగా నాలెడ్జ్ హబ్ భూముల్ని కొట్టేయడానికి సీఎం వైఎస్ జగన్ కుట్రలు చేస్తున్నాడు అని ధ్వజమెత్తారు. అనంతపురం జిల్లాలోని బడుగు బలహీనవర్గాల రైతులకు చెందిన 8,864 ఎకరాల్ని తండ్రి అధికారంతో నాడు జగన్ ఇందూప్రాజెక్ట్స్, లేపాక్షి నాలెడ్జ్ హబ్ సంస్థలకు కట్టబెట్టారని మండిపడ్డారు. వివిధ వక్రమార్గాల్లో ఇప్పుడు వాటిని తనపరం చేసుకునేందుకు ఉవ్విళ్లూరుతున్నారని కాలవ శ్రీనివాసులు ఆరోపించారు.
రైతులనోట్లో మట్టికొట్టి, బ్యాంకులకు బురిడీవేసి, భూముల్ని కాజేయడానికి తన బంధువుల కంపెనీల్ని తెరపైకి తెచ్చాడని కాలవ శ్రీనివాసులు ఆరోపించారు. మంగళగిరిలోని పార్టీజాతీయ కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నాలెడ్జ్ హబ్ పేరుతో ఎకరాకు రూ.60వేల నుంచి రూ.1.50లక్షల వరకు రైతులకు తూతూమంత్ర పరిహారమిచ్చి, కొట్టేసిన వేలకోట్లవిలువైన భూముల్ని స్వాహాచేసేందుకు జగన్ సిద్ధమయ్యాడని మండిపడ్డారు. లేపాక్షి నాలెడ్జ్ హబ్ భూముల్ని తాకట్టుపెట్టి ఒకసారి, అమ్ముకొని మరోసారి జగన్ విపరీతమైన లబ్ధిపొందారని మండిపడ్డారు. జగన్ దొంగ తెలివితేటలకు అనంతపురం జిల్లాలోని చిలమత్తూరు గోరంట్ల మండలాల్లోని బడుగుబలహీనవర్గాల వారిభూమి బలైపోయిందని వ్యాఖ్యానించారు. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నాలెడ్జ్ హబ్ పేరుతో రైతులనుంచి తక్కువ ధరకు భూముల్ని సేకరించారని ఆరోపించారు. రైతులకు ఎకరాకు రూ.60వేలనుంచి రూ.1.50 లక్షల వరకు తూతూమంత్రంగా పరిహారమిచ్చి, పరిశ్రమలువస్తాయి. పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని నమ్మించి వంచించారని ధ్వజమెత్తారు. బ్యాంకుల నుంచి భూముల్ని కొట్టేయడానికి తన మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి కుమారుడు డైరెక్టర్‌గా ఉన్న ఎర్తిన్ అనే అనామక కంపెనీని జగన్ తెరపైకి తెచ్చారని చెప్పారు. లేపాక్షి నాలెడ్జ్ హబ్ భూముల్ని ఎర్తిన్‌కు ధారాధత్తంచేసేందుకు రాష్ట్రఅధికార యంత్రాంగం మొత్తం పరుగులు పెట్టిందంటే దాని వెనుక జగన్ హస్తముండబట్టేనని ఆరోపణలు చేశారు.
2013-14లో నాలెడ్జ్ హబ్ భూములద్వారా రూ.54కోట్ల ఆదాయం వచ్చినట్టు చెప్పిన లేపాక్షి సంస్థ, ఢిల్లీసంస్థకు చెల్లించాల్సిన రూ.5కోట్లు ఎందుకుచెల్లించలేదని ప్రశ్నించారు. రూ.5కోట్లతో పోయేదానికి 2,650ఎకరాలు కట్టబెట్టే ప్రయత్నాలు ఎందుకు చేశారు? అని నిలదీశారు. లేపాక్షి నాలెడ్జ్ హబ్ ముసుగులో జగన్ సాగించిన అక్రమ భూకుంభకోణం కుంభకోణాలకే పరాకాష్టగా నిలిచింది. జగన్మోహన్ రెడ్డి ధనదాహానికి, అవినీతికి పేదలభూములు ఎలా బలైపోయాయో చెప్పడానికి పెద్దఉదాహరణ లేపాక్షి నాలెడ్జ్ హబ్ ఉదంతం. విచ్చలవిడి కుంభకోణాలతో పేదల్ని దోచుకుంటున్న జే గ్యాంగ్ ముఠా ఆటకట్టించాల్సిన బాధ్యత రాష్ట్రప్రజలపైనే ఉంది అని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు కాలవ శ్రీనివాసులు స్పష్టంచేశారు.
ఇవి కూడా చదవండి :: మళ్లీ జగనే.. విజయ రహస్యం అదే !